ఏపీలో 3వేల 279 నామినేషన్లు.. నియోజకవర్గానికి 19మంది

  • Published By: vamsi ,Published On : March 26, 2019 / 03:34 AM IST
ఏపీలో 3వేల 279 నామినేషన్లు.. నియోజకవర్గానికి 19మంది

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సంబంధించి ఒక ఘట్టం పూర్తయింది. ప్రధాన పార్టీల నుండి, ఇండిపెండెంట్‌లుగా రెబల్స్‌గా రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్‌లు వేశారు. మొత్తం 3వేల 2వందల 79మంది నామినేషన్‌లను ఈసారి రాష్ట్రంలో వేశారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలకు 370మంది నామినేషన్లు వేయగా..  అతి తక్కువగా విజయనగరం జిల్లాలో 111 నామినేషన్లు వేశారు. సగటున ఒక్కో నియోజకవర్గానికి 19మంది పోటీ పడుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుండగా 146 మంది, విశాఖపట్నం జిల్లాలో 15 నియోజకవర్గాలుండగా 245, తూర్పు గోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలుండగా 219, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలుండగా 244 మంది, కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా 353మంది, ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలుండగా  236 నామినేషన్లను అభ్యర్ధులు వేశారు. 

అలాగే నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలుండగా 129మంది, చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలుండగా 287మంది, అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలుండగా 288మంది, కడప జిల్లాలో 10 నియోజకవర్గాలుండగా 217మంది, కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలుండగా 334 మంది నామినేషన్లను దాఖలు చేశారు. లోక్‌ సభ విషయానికి వస్తే 25 స్థానాలకు గాను 472 మంది నామినేషన్‌ వేశారు. అత్యధికంగా నంద్యాల నుంచి 36 మంది పోటీ పడుతున్నారు. అనంతపురం నుంచి 23మంది బరిలో ఉన్నారు.