గిద్దలూరులో గద్దెనెక్కేదెవరు..? పశ్చిమాన పాగా వేసేదెవరు

  • Published By: madhu ,Published On : April 20, 2019 / 01:28 PM IST
గిద్దలూరులో గద్దెనెక్కేదెవరు..? పశ్చిమాన పాగా వేసేదెవరు

ప్రకాశం జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ ప్రాంతంలోని గిద్దలూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. కానీ ఈసారి ఎన్నికల్లో పోరు మాత్రం .. అంత ఆషామాషీగా జరగలేదు. ప్రధాన పార్టీల నుంచి ధీటైన అభ్యర్థులు బరిలో దిగడంతో పోరు హోరాహోరీగా సాగింది. దీంతో ఇప్పుడు ప్రకాశం పశ్చిమాన పాగా వేసేదెవరనే దానిపై..  స్థానికంగా పెద్ద చర్చ నడుస్తోంది.

గిద్దలూరులో పట్టు సాధించాలని భావించిన టీడీపీ .. మొదటి నుంచీ తన వ్యూహాలకు పదును పెట్టింది. వైసీపీలో సీటు ఆశించి దక్కని అసంతృప్త నేతలను తనవైపు తిప్పుకోవడంలో కొంతమేర సక్సెస్ అయ్యింది. స్థానికంగా రాజకీయ చరిష్మా ఉన్న పిడతల సాయికల్పనా రెడ్డిని తనవైపు రప్పించుకోవడంలో…. టీడీపీ అభ్యర్ధి అశోక్ రెడ్డి సక్సెస్ అయ్యారు. సాయికల్పన రాకతో కొంతమేర టీడీపీకి పట్టు లభించింది. దీనికి తోడు సొంత సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకునేలా గ్రామ..గ్రామాన భారీ ప్రచారం చేశారు అశోక్‌రెడ్డి. దీంతో ఇక్కడ విజయం ఈజీ అనుకున్న వైసీపీకి.. టఫ్‌గా మారింది.
Also Read : టీడీపీ నేత సీఎం రమేష్ మేనల్లుడు ఆత్మహత్య

వైసీపీ అభ్యర్ధి అన్నా రాంబాబు, టీడీపీ అభ్యర్ధి అశోక్ రెడ్డి ఇద్దరూ ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నావారే. స్థానికంగా మాసిజం ప్రదర్శించడంలోనూ ఎవ్వరికెవ్వరు తీసిపోరు. ఇక క్యాడర్‌ను నిర్మించుకోవడంలోనూ, బూత్‌ స్థాయి మేనేజ్‌మెంట్‌లోనూ ఇద్దరూ గట్టివారే. 2014లో  వైసీపీ నుంచి విజయం సాధించిన అశోక్‌రెడ్డి….టీడీపీలోకి ఫిరాయించడంతో స్థానికంగా కొంత వ్యతిరేకత వ్యక్తమైనా అభివృద్ది మంత్రం అక్కడి వారిపై కొంతమేర పని చేసింది. జనసేన అభ్యర్ధిగా నిలబడ్డ చంద్రశేఖర్ యాదవ్‌.. కాపు ఓటుతో పాటు వైసీపీకి అండగా ఉండే యాదవ ఓట్లను చీల్చడం కూడా టీడీపీకి కలసి వస్తుందని అంచనా వేస్తున్నారు. 

మరోవైపు తనకు ఎంతో అనుకూలమైన గిద్దలూరు ప్రాంతంలో పట్టు నిలబెట్టుకునేందుకు .. వైసీపీ సర్వశక్తులు ఒడ్డింది. వైసీపీ అభ్యర్ధి అన్నా రాంబాబు .. నియోజకవర్గంలోని తన వర్గంతో పాటు.. పార్టీ ఫిరాయించిన నేతలను తిరిగి వైసీపీలోకి రప్పించడంలో సక్సెస్ అయ్యాడు. స్థానికంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి వ్యక్తిగతంగా అన్నాపై కొంత మేర వ్యతిరేకత వున్నా.. జగన్ చరిష్మాతో రెడ్డి సామాజికవర్గ ఓటర్లు వైసీపీ వైపు నిలబడ్డారని అంచనా వేస్తున్నారు.

దీనికి తోడు అన్నా సొంత సామాజికవర్గంతో పాటు దళిత, ముస్లిం, ఓటర్లలో 65శాతం, 40 శాతానికి పైగా యాదవ సామాజికవర్గాలు వైసీపీ వైపే నిలిచారని .. ఆపార్టీ నేతలు లెక్కలు వేస్తున్నారు.. వెలిగొండకు నీరిస్తామని హామీ ఇచ్చిన టీడీపీ దాన్ని నిలబెట్టుకోలేదని…. తాము అధికారంలోకి వస్తే ప్రాజెక్ట్‌ను పూర్తిచేస్తామనే జగన్ హామీ.. రైతుల్లో వైసీపీపై నమ్మకాన్ని పెంచిందని ఆపార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో ఈసారి కూడా వైసీపీ జెండా ఎగరడం ఖాయమని  ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరి టీడీపీ విజయాన్ని సాధించి చరిత్రను తిరగరాస్తుందా.. లేక వైసీపీ మరోసారి తన పట్టు ప్రదర్శిస్తుందా తెలాలంటే .. మే 23వరకు ఓపిక పట్టక తప్పదు మరి.
Also Read : దేవుడు దిగిరావాలి : చంద్రబాబు సీఎం అవకుండా ఆపలేరు