టికెట్‌ ఫైట్‌ : నెల్లిమర్ల టిడిపి టికెట్ ఎవరికి

  • Edited By: madhu , January 24, 2019 / 01:22 PM IST
టికెట్‌ ఫైట్‌ : నెల్లిమర్ల టిడిపి టికెట్ ఎవరికి

సతివాడలో 8 సార్లు పెనుమత్స సాంబశివరాజు విజయం
భోగాపురంలో 6 సార్లు పతివాడ గెలుపు
నెల్లిమర్ల నుంచి 2014 ఎన్నికల్లో ఏడోసారి విజయం 
టీడీపీ టికెట్‌పై సర్వత్రా ఆసక్తి
విజయనగరం :
జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంతో ప్రత్యేకత ఉంది. 2009కి ముందు జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో సతివాడ, భోగాపురం నియోజకవర్గాలు రద్దయి నెల్లిమర్ల నియోజకవర్గంగా ఏర్పడింది. మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు సతివాడ నుంచి ఎనిమిది సార్లు ప్రాతినిధ్యం వహించగా, భోగాపురం నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించారు. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి నారాయణస్వామినాయుడు ఏడోసారి విజయం సాధించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 
పతివాడకు వయోభారం : 
ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్టు ఎవరికి దక్కుతుందన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు పనితీరుపై ఎటువంటి అభ్యంతరాలు లేనప్పటికీ.. వయోభారం కారణంగా మళ్లీ పోటీ చేయడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పతివాడకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. నిరాడంబరత, నిజాయితీగా ఉండే నారాయణస్వామినాయుడు ప్రస్తుతం వృద్దాప్యం, అనారోగ్యం సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పతివాడ సొంతంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేరనే వార్తలున్నాయి. దీంతో టికెట్టు కోసం ఆయన అనుచరులే ప్రయత్నాలు మొదలుపెట్టడం గందరగోళానికి దారితీస్తోంది. అటు.. సిట్టింగ్ ఎమ్మెల్యే కుటుంబానికే తిరిగి టికెట్టు వస్తుందన్న ప్రచారం కూడా సాగుతోంది. ఒకవేళ ఆయనకు కాకపోయినా.. కుమారుల్లో ఒకరికి టికెట్టు ఖాయం చేయవచ్చన్న సమాచారం ఉంది.
చిన్నం నాయుడు…తమ్మి నాయుడు : 
నారాయణస్వామి నాయుడి ముగ్గురు కుమారుల్లో చిన్న కుమారుడు తమ్మినాయుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈయన పనితీరుపై పలు విమర్శలు, ఆరోపణలున్నాయి. ఇసుక వ్యాపారంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో కమీషన్లు, అధికార, అనధికార కార్యకలాపాల్లో తమ్మినాయుడు ప్రమేయంపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఈయనకు టికెట్టు వచ్చే అవకాశాలు లేవనే ప్రచారం జరుగుతోంది. రెండో కుమారుడు వైద్య వృత్తిలో ఉండగా.. పెద్ద కుమారుడు చిన్నంనాయుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్నారు. ఒకవేళ పతివాడకు టికెట్‌ రాకపోయినా.. పెద్ద కుమారుడు చిన్నంనాయుడికైనా  టికెట్టు వచ్చే అవకాశాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. 
తెరపైకి కడగల ఆనంద్ పేరు : 
ఇక కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు తమకే టికెట్టు వస్తుందంటూ హంగామా చేస్తుండటం నియోజకవర్గంలో గందరగోళానికి దారితీస్తోంది. టికెట్టు ఆశిస్తున్న వారిలో ఆ పార్టీ నాయకుడు, వ్యాపారవేత్త కడగల ఆనంద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయన ఎప్పటి నుంచో పార్టీ క్రియాశీలక నాయకుడుగా, ఎమ్మెల్యే అనుచరుడుగా ఉంటున్నారు. పార్టీ వ్యవహారాల్లోనూ, సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్టు దక్కించుకునేందుకు తనవంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. అలాగే భోగాపురం ఎంపీపీ కర్రోతు బంగార్రాజు కూడా టికెట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక నెల్లిమర్ల టికెట్టు రేసులో గంటా పేరు సైతం వినిపించింది. కానీ.. ఎంపీ అశోక్ గజపతిరాజుకు, గంటాకు మధ్య తలెత్తిన విభేదాల కారణంగా తన ప్రయత్నాలకు ఫుల్ స్టాఫ్ పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు  టికెట్టు తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే పతివాడకే వస్తుందన్న ధీమా ఆయన వర్గీయుల్లో వ్యక్తమవుతోంది.
పతివాడ పోటీ చేయడంపై అనుమానాలు 
టికెట్‌ కోసం పతివాడ అనుచరుల ప్రయత్నాలు 
పతివాడ కుటుంబానికే టికెట్‌ వస్తుందన్న ప్రచారం
టికెట్‌ ఆశిస్తున్నవారిలో కడగల ఆనంద్ పేరు