సోనూసూద్ ట్రాక్టర్ సాయంలో ట్విస్ట్? స‌ర‌దాగా దిగిన ఫోటోనే ఇది!

  • Published By: vamsi ,Published On : July 27, 2020 / 03:30 PM IST
సోనూసూద్ ట్రాక్టర్ సాయంలో ట్విస్ట్? స‌ర‌దాగా దిగిన ఫోటోనే ఇది!

సామాన్యులకు, పేదలకు సాయం చేసి ఒక్కసారిగా హీరో అయిపోయిన సోనూసుద్.. ఏపీలో ఓ కుటుంబానికి సాయం చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు చేసినా.. రియల్ లైఫ్‌లో హీరో అనిపించుకున్నారు. వలస కార్మికులకు దేవుడిగా మారి.. విదేశాల్లో చిక్కుకున్నవారికి బంధువుగా అయ్యి.. ఉపాధి కోల్పోయిన వారికి ఆసరాగా నిలిచి.. సోషల్ మీడియాలో సాయం అంటే సై అంటూ ముందుకు వస్తున్నాడు.

ఈ క్రమంలోనే కూతుళ్లతో నాగలి పట్టించిన రైతుకు సాయంత్రానికి ట్రాక్టర్ ఇచ్చారు.. అయితే కాస్త విచారించుకోవాలనేది కూడా నెటిజన్ల అభిప్రాయం. నిరుపేదలు, కఠిక దరిద్రులకు అందకుండా.. కాస్త సెటిల్ అయిన కుటుంబానికి అందడమే కాస్త విమర్శలకు గురవుతుంది.

ట్రాక్టర్ అందుకున్న నాగేశ్వరరావు ఎవరంటే:
చిత్తూరు జిల్లా కంభంవారిపల్లె మండలం మహల్ రాజపల్లికి చెందిన రైతు వీరదల్లు నాగేశ్వరరావు సాధారణ రైతేం కాదు.. ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం నేతగా కూడా పనిచేశారు. కమ్యునిస్ట్ ఉద్యయాల్లో పాల్గొని మావోయిస్టుల హక్కులపై ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇతనికి సొంత ఇల్లు ఉంది. చాలా చైతన్యవంతమైన వ్యక్తి కూడా. సమాజం కోసం పోరాటం చేస్తున్నాడు. సోనూసూద్ నుంచి ట్రాక్టర్ సహాయం పొందిన రైతు లోక్ సత్తా పార్టీ తరపున ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. ఇతను ఉండేది మదనపల్లె పట్టణంలో.. కరోనా లాక్ డౌన్ కారణంగా పల్లెటూరు బెటర్ అని సొంతూరు మహల్ రాజపల్లి వెళ్లారు.

ట్రాక్టర్ దొరక్క.. కూలీలు లేక మాత్రమే.. డబ్బులు లేక కాదు:
సోనుసూద్ నుంచి ట్రాక్టర్ అందుకున్న రైతు వీరదల్లు నాగేశ్వరరావు రైతే.. కాకపోతే 365 రోజూల వ్యవసాయంపై ఆధారపడి జీవించే వ్యక్తి మాత్రం కాదు. కరోనా కారణంగా పల్లెటూరు వచ్చారు అంతే.. దుక్కిదున్నటానికి ట్రాక్టర్లు అందుబాటులో లేక కూలీలు కూడా దొరకక.. తన కూతుళ్లతో సరదాగా ఇలా చేశాడు. అంతేకానీ డబ్బులు లేక కఠిక దరిద్రంలో ఉండి ఈ పని చేయలేదు.

ప్రభుత్వం నుంచి రైతుకు సాయం అందిందట:
చిత్తూరు జిల్లా మహల్రాజుపల్లి రైతు నాగేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం నుంచి అన్ని పథకాల కింద సాయం అందుతుంది. గతేడాది రైతు భరోసా కింద రూ. 13వేల 500 ఈ రైతు నాగేశ్వరరావు ఖాతాలో పడ్డాయి. ఈ ఏడాది రైతు భరోసా కింద ఇప్పటికే రూ.7వేల 500 అందుకున్నాడు. అంతేకాదండీ.. చిన్నకూతురుకు జగనన్న అమ్మ ఒడి కింద 2020 జనవరిలో రూ.15 వేల రూపాయలు కూడా అందాయి. రైతు నాగేశ్వరరావు తల్లి.. అభయహస్తం కింద పెన్షన్‌ తీసుకుంటుంది. కరోనా సమయంలో ప్రభుత్వం అందించిన వెయ్యి రూపాయల ఆర్థిక సాయం కూడా అందుకుంది. తన రెండు ఎకరాల పొలంలో వేరు శెనగ వేయడానికి రైతు భరోసా కేంద్రం నుంచి డీఏపీ ఎరువు, విత్తనాలు కూడా తీసుకున్నారు.

వివరాలు తెప్పించుకున్న ప్రభుత్వం:
రైతు నాగేశ్వరరావు కరోనా ప్రభావంతో అద్దెకు ట్రాక్టరు దొరక్క.. కూలీలు రాక కుమార్తెల సాయంతో దున్నుతున్న వార్తను ఈనాడు పత్రిక ప్రచురించింది. ఇందులో డబ్బులు లేక.. నిరుపేదలు అని కానీ.. కఠిక దరిద్రులు అని కానీ ఎక్కడా లేదు. ట్రాక్టర్ దొరికి ఉంటే డబ్బులు ఇచ్చే స్థోమత నాగేశ్వరరావుకి ఉంది.. కూలీలు దొరికితే డబ్బులు ఇచ్చే స్థోమత కూడా రైతు నాగేశ్వరరావుకు ఉంది. ఈ వార్తను పక్కన పెడితే.. దీనిపై ఏపీ ప్రభుత్వం ముందుగానే స్పందించినట్లు చెబుతున్నారు చిత్తూరు జిల్లా అధికారులు. వివరాలు సేకరించమని సీఎం ఆఫీస్ నుంచి కంభంవారిపల్లె మండలం ఎంపీడీవోను ఆదేశించింది. అతను స్వయంగా గ్రామానికి వెళ్లి విచారించారు. ఇది సరదాగా చేశాం అని వెల్లడించారంట రైతు నాగేశ్వరరావు. ఈలోపు అతని కుటుంబానికి సంబంధించిన అన్ని వివరాలను గ్రామ వాలంటీర్ ద్వారా కూడా సేకరించారంట. డబ్బున్న కుటుంబమే అని తెలిసిందంట. దీంతో ప్రభుత్వం కూడా సైలెంట్ అయ్యింది. ఈ వివరాలన్నీ కూడా హిందూ పత్రిక కూడా ప్రచురించింది. కాకపోతే సోనూసుద్ ట్విట్ చేయటం… స్పందించటం చకచకా జరిగిపోయాయి.

ట్రాక్టర్ తిరిగి ఇచ్చే ఆలోచనలో రైతు నాగేశ్వరరావు:
లోక్ సత్తా పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రైతు నాగేశ్వరరావు.. ఇప్పుడు ఆ ట్రాక్టర్‌ను తిరిగి ఇచ్చే ఆలోచనలో ఉన్నారంట. ట్రాక్టర్ ఇంటికి వచ్చిన తర్వాత.. దేశవ్యాప్తంగా అతని ఆర్థిక, కుటుంబ పరిస్థితులను ప్రభుత్వాలు, సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి.