నిజమేనా : కోడెల నివాసంలో చోరీ

  • Published By: madhu ,Published On : August 23, 2019 / 03:26 AM IST
నిజమేనా : కోడెల నివాసంలో చోరీ

మాజీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు నివాసంలో చోరీ జరిగింది. కంప్యూటర్లకు సంబంధించిన మానిట్లరు పడేసి..సీపీయూలు ఎత్తుకెళ్లారు. 2019. ఆగస్టు 22వ తేదీ రాత్రి కోడెల నివాసానికి వచ్చిన వ్యక్తులు వాచ్ మెన్‌ను నెట్టివేశారు. అనంతరం లోనికి ప్రవేశించి కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. కోడెల నివాసానికి సమీపంలో మానిటర్లు పడి ఉన్నాయి. 

వీరు ఎవరో తెలియడం లేదు. మరికొన్ని వస్తువులు కూడా అపహరించినట్లు తెలుస్తోంది. గతంలో స్పీకర్ కార్యాలయంలో పనిచేసిన వారే చోరీకి పాల్పడి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అసెంబ్లీకి సంబంధించిన కొంత ఫర్నీచర్‌ను తాను వినియోగించుకున్నట్లు ఇటీవలే కోడెల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దొంగతనం జరగడం చర్చనీయాంశమైంది. 

మరోవైపు కోడెల శివప్రసాదరావు తరలించిన ఫర్నిచర్ రికవరీపై అధికారులు దృష్టి పెట్టారు. ఆగస్టు 23వ తేదీ శుక్రవారం నర్సరావుపేట వెళ్లనున్న అధికారులు అసెంబ్లీ నుంచి తీసుకెళ్లిన వస్తువులను రికవరీ చేస్తారు. మొత్తం మూడు చోట్ల ఈ వస్తువులన్నట్లు చెబుతున్నారు. గతంలో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తరలిస్తున్న క్రమంలో ఈ ఫర్నిచర్‌ పక్కదారి పట్టింది.

దీనిపై కేసు నమోదు కాకపోయినా అంతర్గత విచారణ జరిగింది. ఆ తర్వాతే తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. తన క్యాంపు కార్యాలయంలో వినియోగించేందుకే ఈ ఫర్నిచర్ తీసుకెళ్లినట్లు కోడెల కూడా అంగీకరించారు. వాటిని వెనక్కు తీసుకెళ్లాలని లేఖ రాసానని… లేదంటే వాటి విలువ చెల్లిస్తానని చెప్పారు. అయితే ఇది రాజకీయంగా సంచలనంగా మారింది. టీడీపీ నుంచి కూడా కోడెలకు మద్దతు లభించలేదు.

గతకొన్ని రోజులుగా కోడెలపై పలు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు అక్రమాలు చేశారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. కేఎస్టీ పేరిట సత్తెపల్లి, నర్సరావుపేటలో వసూళ్ల పర్వం కొనసాగించారని సంచలనం సృష్టించింది. ఇటీవలే కోడెల కొడుకు చెందిన ద్విచక్ర వాహన షోరూంలో సైతం నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో సీజ్ చేశారు అధికారులు. కేబుల్ వైర్ల ట్రాక్టర్లతో కోడెల నివాసం వద్ద కొంతమంది ధర్నాలు చేశారు. అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్‌ను తాను తిరిగి ఇచ్చేస్తానని..లేకపోతే డబ్బైనా ఇస్తానని కోడెల వెల్లడించిన క్రమంలో దొంగతనం జరగడం గమనార్హం. 

Read More : మరో షాక్ : టీడీపీ ఎమ్మెల్యే ఆఫీస్ కి కూల్చివేత నోటీసులు