యురేనియం చిచ్చు : నల్లమల్ల ఫారెస్టులో జీవాల మనుగడ ప్రశ్నార్థకం

నల్లమల్ల అభయారణ్యంలో యురేనియం తవ్వకాల చిచ్చు రేగుతోంది. యురేనియం తవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మూగ జీవాల మనుగడను ప్రశ్నార్ధకం చేయబోతోంది.

  • Published By: veegamteam ,Published On : September 6, 2019 / 08:53 AM IST
యురేనియం చిచ్చు : నల్లమల్ల ఫారెస్టులో జీవాల మనుగడ ప్రశ్నార్థకం

నల్లమల్ల అభయారణ్యంలో యురేనియం తవ్వకాల చిచ్చు రేగుతోంది. యురేనియం తవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మూగ జీవాల మనుగడను ప్రశ్నార్ధకం చేయబోతోంది.

ఎటుచూసినా పచ్చదనం. ఆకాశాన్ని ముద్దాడే చెట్లు. గలగలా పారే జలపాతాలు. సెలయేళ్లు.. పక్షుల కిలకిలారావాలు. ఇదీ నల్లమల్ల అభయారణ్యంలో మనకు సాక్షాత్కరించే దృశ్యాలు. అయితే ఇక మీదట అవి కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నల్లమల్ల అభయారణ్యంలో యురేనియం తవ్వకాల చిచ్చు రేగుతోంది. పచ్చని ప్రకృతిని విచ్ఛిన్నం చేసి.. యురేనియం తవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మూగ జీవాల మనుగడను ప్రశ్నార్ధకం చేయబోతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల్లో విస్తరించిన అటవీ ప్రాంతం.. త్వరలోనే పెద్ద పెద్ద యంత్రాల రణగొణ ధ్వనులతో, యురేనియం తవ్వకాలతో తన ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడింది.

నల్లమల్ల అటవీప్రాంతం కర్నూలు, గుంటూరు, కడప, మహబూబ్‌నగర్, ఉమ్మడి నల్లగొండ, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల పరిధిలో 1.99 లక్షల హెక్టార్లలో నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి. అక్కడ లక్షల కోట్ల రూపాయల విలువైన యురేనియం నిక్షేపాల నిల్వలు ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. 2008 నుంచి అణుశక్తి సంస్థ ఖనిజాన్వేషణ మొదలుపెట్టింది. 2014 వరకు ఈ అన్వేషణ కొనసాగింది. ఇవి లభ్యం కావడంతో అమ్రాబాద్‌-ఉడిమిల్ల, నారాయణపూర్‌ ప్రాంతాల్లో డ్రిల్లింగ్‌ అనుమతుల కోసం అణుశక్తి విభాగం ప్రతిపాదన పంపింది. నాగార్జునసాగర్‌ ప్రాంతంలోని నిడ్గుల్‌ రక్షిత అటవీ ప్రాంతంలోని 7చదరపు కిలోమీటర్లు, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లోని 87చదరపు కిలోమీటర్లలో యురేనియం నిక్షేపాల అన్వేషణ, సర్వేకు అనుమతులు ఇవ్వాలని కోరింది. 

భూగర్భం నుంచి వెలికితీసే యురేనియంతోపాటు వచ్చే నీటి వూటను ఎలా నిల్వ చేస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఉడిమిళ్ల, తిర్మలాపూర్‌, నారాయణపూర్‌ ప్రాంతాలకు పది కిలోమీటర్ల దూరంలోనే కృష్ణా నది ప్రవహిస్తోంది. ఒకవైపు శ్రీశైలం, మరోవైపు నాగార్జునసాగర్‌ జలాశయాలు ఉన్నాయి. పర్యావరణానికి ప్రమాదంతోపాటు లక్షల మందికి జీవనాధారమైన తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్న భయం స్థానికుల్లో కనిపిస్తోంది. నల్లమల్లలో మాత్రమే కనిపంచే అరుదైన జంతువులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. 

మే 22న అటవీ సలహా మండలి సమావేశం జరిగింది. ఇందులో ఆమోదించిన అంశాల ప్రకారం అమ్రాబాద్‌ అభయారణ్య ప్రాంతంలోని 87 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో యురేనియం తవ్వకాలు జరుగుతాయి. 20 వేల టన్నుల యురేనియం అక్కడ ఉన్నట్లు ప్రాథమిక అంచనాకొచ్చారు. దాన్ని తవ్వేందుకు 4000 పైచిలుకు బోర్లు వేస్తారు. యురేనియం తవ్వకాలు మొదలైతే ఆ ప్రాంతంలో మానవ సంచారం పూర్తిగా నిలిచిపోతుంది. అటవీ భూము లు కోతకు గురవుతాయి. వృక్ష సంపద, జంతుజాలం దెబ్బతింటాయి, పులులను వేరే అభయారణ్యాలకు తరలించాలి, ఆదివాసీలకూ స్థానచలనం తప్పదని స్ధానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2009లో అనేక ఉద్యమలు చేసి యురేనియం తవ్వకాలను అడ్డుకున్నారు.  కేంద్రం మరోసారి యురేనియం తవ్వకాలకు సిద్ధమవుతుండడంతో ఆదివాసీలు పోరుకు రెడీ అవుతున్నారు.

యురేనియం తవ్వకాలు జరిగే ప్రదేశాల్లో శత్రుదేశాల ముప్పు నుంచి కాపాడుకునేందుకు ఐదంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. దీని వల్ల యురేనియం తవ్వకాల పేరిట చెంచులను కూడా మైదాన ప్రాంతాలకు తరలించడం అనివార్యమవుతోంది. యురేనియం వెలికితీతవల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోని నీరు కూడా కలుషితమవుతుందని స్ధానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శైవ క్షేత్రాలైన ఉమామహేశ్వరం, మద్దిమడుగు ఆంజనేయస్వామి దేవాలయం, గోరాపురం భ్రమరాంబ మల్లికార్జున దేవాలయం, లొద్ది మల్లయ్య, సలేశ్వర క్షేత్రాలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. శ్రీశైలం వెళ్లాలన్నా.. నిషేధాజ్ఞలు అమల్లో వుంటాయని స్ధానికులు అంటున్నారు. 
యురేనియం సాకుతో విలువైన వజ్రాలను దోచుకునేందుకు కొన్ని కార్పొరేట్ శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని, వారి ఆటలు సాగనివ్వబోమని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

వివిధ ఖనిజాలతో కలిసి ఉండే యురేనియాన్ని వేరు చేసే పద్ధతిలో ఏమాత్రం లోపం తలెత్తినా ఆ ప్రాంతంలో వాతావరణం దెబ్బతింటుంది. సురక్షితమైన పద్ధతుల్లో భూగర్భం నుంచి ముడి యురేనియంను వేరు చేసి శుద్ధి చేస్తేనే స్వచ్ఛమైన యురేనియం లభిస్తుంది. ఇదంతా క్లిష్టమైన ప్రక్రియ అని.. వేలాది వన్యప్రాణులు, అరుదైన పులులు ఉన్న నల్లమల ఉనికికే ఇది ప్రమాదమని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో శతాబ్దాలుగా జీవిస్తున్న ఆదివాసీ చెంచు గిరిజనులు, ఇతర వర్గాల ప్రజలు తమ ఆరోగ్యాలను పణం పెట్టలేమంటున్నారు. పారిశ్రామిక వృద్ధిని వ్యతిరేకించకున్నా ప్రమాదకరమైన ఖనిజాల వెలికితీతతో ముప్పు వాటిల్లుతుందన్న ఆందోళన అంతటా వినిపిస్తోంది.