శ్రీవారి భక్తులకు శుభవార్త

  • Edited By: veegamteam , November 27, 2019 / 07:57 AM IST
శ్రీవారి భక్తులకు శుభవార్త

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. భక్తులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వైకుంఠ దర్శనాన్ని పది రోజుల పాటు అనుమతి కల్పించాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా..10 రోజుల పాటు వైకుంఠ దర్శనాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే భక్తులను వైకుంఠ ద్వారం గుండా స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. 

కానీ..భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకున్న టీటీడీపీ యాజమాన్యం వీలైనంత ఎక్కువమంది భక్తులకు వైకుంఠ దర్శనం కల్పించేందుకు టీటీడీ సన్నాహకాలు చేస్తోంది. వైకుంఠ ద్వార మహోత్సవం పేరుతో వైకుంఠ ద్వారాలను 10 రోజుల పాటు తెరిచి ఉంచాలని టీటీడీ ప్రతిపాదించింది. దీనికి  టీటీడీ ఆగమ సలహామండలి కూడా అంగీకారం తెలిపింది. అయితే ఈ నూతన విధానాన్ని పాలకమండలి కూడా ఆమోదించాల్సి ఉంది. పాలకమండలి ఆమోదం తెలిపితే ఈ ఏడాది నుంచే నూతన విధానం అమల్లోకి రానుంది.
 
సాధారణంగా శ్రీరంగం ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను 15 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో తిరుమల కొండమీద కూడా వైకుంఠ ద్వారాలను 10 రోజుల పాటు తెరిచి భక్తులకు స్వామి వారి వైకుంఠ దర్శన భాగ్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతోనే టీటీడీ నూతన విధానానికి శ్రీకారం చుడుతున్నాట్లుగా తెలుస్తోంది.