337 ఓట్లు ఉంటే 370 ఓట్లు పోలయ్యాయి : ఈసీకీ టీడీపీ ఫిర్యాదు

  • Published By: veegamteam ,Published On : April 18, 2019 / 09:51 AM IST
337 ఓట్లు ఉంటే 370 ఓట్లు పోలయ్యాయి : ఈసీకీ టీడీపీ ఫిర్యాదు

అమరావతి : పోలింగ్ ముగిసినా ఏపీలో ఎన్నికల వేడి తగ్గడం లేదు. ఈవీఎంలపై టీడీపీ నేతలు రోజుకో ఫిర్యాదు చేస్తున్నారు. ఈవీఎంలో లోపాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు పోరాటం చేస్తున్నారు. తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఏపీ సీఈవో ద్వివేదికి కంప్లయింట్ చేశారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు రిటర్నింగ్ అధికారి ఈవీఎంలను 24 గంటలు ఇంట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. కలెక్టర్ ఇంతియాజ్ మాత్రం తప్పులేమీ జరగలేదని ఈసీకి రిపోర్ట్ ఇచ్చారని వర్ల రామయ్య మండిపడ్డారు.

ఈవీఎంలను ఆర్వో తన ఇంటికి ఎలా తీసుకెళ్తారని వర్ల రామయ్య ప్రశ్నించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ నివేదికను ఎలా నమ్ముతారు, తప్పుడు నివేదిక ఇచ్చి ఉండొచ్చుగా అని అనుమానం వ్యక్తం చేశారు. కడప జిల్లా రైల్వే కోడూరులోని ఓ బూత్ లో 337 ఓట్లు ఉంటే 370 ఓట్లు పోలయ్యాయని తెలిపారు. ఉన్న ఓట్లకి పోలైన ఓట్లకి ఇంత తేడా ఎలా వచ్చిందన్నారు. దీనిపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా ఉన్న ఈసీని ఎప్పుడూ చూడలేదని వర్ల రామయ్య సీరియస్ అయ్యారు.

ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందని వర్ల రామయ్య విమర్శించారు. ఇంత పనికిమాలిన ఈసీని ఎక్కడా చూడలేదన్నారు. ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును చెత్తబుట్టలో వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రైల్వేకోడూరులో వందకు 107 శాతం ఓట్లు ఎలా వచ్చాయో నిగ్గు తేల్చాలని వర్ల డిమాండ్ చేశారు. ఈవీఎంలను ఆర్వో తన ఇంటికి తీసుకెళ్లిన ఘటనపై దర్యాప్తు చేయాలని ఎలక్ట్రోరల్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందన్నారు. అలాంటిదేమీ లేదని కలెక్టర్ అన్నారని, ఏమీ లేదంటే సరిపోతుందా అని వర్ల మండిపడ్డారు.