వెలిగొండ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ : అక్టోబర్ 11న ఈ-ఆక్షన్

  • Published By: madhu ,Published On : September 22, 2019 / 01:04 AM IST
వెలిగొండ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ : అక్టోబర్ 11న ఈ-ఆక్షన్

వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ పనులకు ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు సిద్ధమైంది. 553.13 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్  23 నుంచి బిడ్‌లను స్వీకరించనుంది. బిడ్‌ల దాఖలుకు అక్టోబర్ 9 తుది గడువుగా నిర్ణయించింది. అక్టోబర్ 11న బిడ్‌, అదే రోజున మధ్యాహ్నం 2గంటల 45నిమిషాలకు ఈ వేలం నిర్వహించనుంది. 

పోలవరం రివర్స్ టెండరింగ్‌తో తొలి విజయాన్ని అందుకుంటున్నామంటున్న వైసీపీ ప్రభుత్వం. దాదాపు రూ. 58 కోట్లు ఆదా చేశామంటోంది. రివర్స్ టెండరింగ్‌తోనే ఇది సాధ్యమైందని చెబుతోంది. కేంద్రం అడ్డు చెప్పినా, హైకోర్టులో పిటిషన్లు వేసినా దూకుడుగా ముందుకు అడుగులు వేయడంతోనే ఇది సాధ్యమైందని చెబుతోంది. ఇదే ఊపులో వెలిగొండ ప్రాజెక్ట్ పనులలోనూ ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానానికి శ్రీకారం చుట్టింది. నిపుణుల కమిటీ సూచనమేరకు.. వెలిగొండ పనులకు.. తాజాగా 553.13 కోట్ల అంచనా వ్యయంతో జలవనరుల శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. 

గతంలో ఇదే పనులకు ఎంపీ సీఎం రమేష్‌కి చెందిన రుత్విక్ సంస్థకు గత ప్రభుత్వం టెండర్లు అప్పగించింది. ఈ ప్రాజెక్ట్ పనుల నుంచి రుత్విక్‌ని తప్పించింది ఏపీ ప్రభుత్వం. ఈ ప్రాజెక్టు టన్నెల్ టెండర్లలో అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. 300 కోట్ల రూపాయలకు పైగా కమీషన్ల రూపంలో తరలిపోయాయనేది ప్రచారం జరిగింది. ఈ క్రమంలో జగన్ సర్కార్ రెండో టన్నెల్ పనులకు గాను.. రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని నిర్ణయించింది.
Read More : అక్టోబర్‌ 10 నుంచి కంటి వెలుగు : షెడ్యూల్‌ విడుదల