గోవిందా..గోవిందా : మన్యంకొండ బ్రహ్మోత్సవాలు

  • Published By: madhu ,Published On : February 14, 2019 / 01:05 AM IST
గోవిందా..గోవిందా : మన్యంకొండ బ్రహ్మోత్సవాలు

మహబూబ్ నగర్ : తెలంగాణ తిరుపతి, కలియుగ వైకుంఠం, కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతున్న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మన్యంకొండ దేవస్థానం బ్రహ్మోత్సవాలు రెడీ అయ్యింది. ఇక్కడి వెంకన్నను మొక్కితే తిరుపతికి వెళ్లిన ఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. తవ్వని కోనేరు, చెక్కని పాదాలు, ఉలి ముట్టని విగ్రహంతో ప్రసిధ్ది గాంచిన మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు…. తెలంగాణ, కర్ణాటక, మహరాష్ట్రల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటి ఏర్పాట్లు పూర్తి చేసింది.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ప్రతియేటా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. అంటే ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడవాహనసేవ, రథోత్సవం, అమ్మవారి కల్యాణోత్సవంతోపాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మన్యంకొండ దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలకు దాదాపు లక్ష మంది వరకు భక్తులు వస్తారని ఆలయకమిటీ అంచనా వేసింది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, నీటి వసతి, టాయ్‌లెట్‌లు, పార్కింగ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

మన్యంకొండ క్షేత్రంలో పూర్వం మునులు తప్పస్సు చేసినందువల్ల మునులకొండ అని పేరు వచ్చింది. అదే కాలక్రమేణా మన్యంకొండగా మారిందని స్థలపురణాణం చెబుతుంది. సుమారు 600 సంవత్సరాల చరిత్రగల ఈ దేవస్థానంలో తవ్వని కోనేరు, చెక్కని పాదాలు, ఉలి ముట్టని విగ్రహం ప్రసిద్ధి చెందాయి. మన్యంకొండ క్షేత్రంలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి గుట్టపై కొలువుదీరగా…. దిగువ కొండవద్ద అలమేలు మంగతాయారు కొలువుదీరి ఉన్నారు.

ఎత్తైన గుట్టలు, పచ్చని చెట్లు, పక్షుల కిలకిలలు, ప్రశాంత వాతావరణం, చల్లనిగాలితొ ప్రకృతి రమణీయతకు మన్యంకొండ శ్రీ వెంకటేశ్వరుని క్షేత్రం కేంద్రంగా నిలుస్తోంది. గుట్టపైనుంచి వచ్చే ఓంకారనాదం భక్తులను పరవశింప చేస్తుంది. అళహరి వంశానికి చెందిన హనుమద్దాసుల వారి కీర్తనలతో మన్యంకొండ ఖ్యాతి గడించింది. హనుమద్దాసుల వారు స్వామివారికి సంబంధించి దాదాపు 300 కీర్తనలు రచించారు. గద్వాల, వనపర్తి సంస్థానాధీశులు మన్యంకొండకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడంతోపాటు స్వామివారి ఉత్సవాలకు తమ సైనికులతో కలిసి ప్రతి ఏడాది మన్యం కొండకు వచ్చి స్వయంగా స్వామివారికి సేవా కార్యక్రమాలు నిర్వహించేవారని చెబుతారు. ప్రతి శనివారం తిరుచ్చిసేవ, ప్రతి పౌర్ణమికి స్వామివారి కళ్యాణమహోత్సవాన్ని నిర్వహిస్తారు. దేవస్థానానికి వచ్చే భక్తులు స్వామివారికి కొత్తకుండలో అన్నం, పచ్చిపులుసు చేసి వాటిని పూలతో అలంకరించి దాసరులతో పూజలు చేయించి నివేదిస్తారు.