అంతర్జాతీయ స్థాయికి బెజవాడ ఎయిర్ పోర్ట్

  • Published By: veegamteam ,Published On : January 3, 2019 / 09:52 AM IST
అంతర్జాతీయ స్థాయికి బెజవాడ ఎయిర్ పోర్ట్

అంతర్జాతీయ ప్రమాణాలతో విజయవాడ ఎయిర్ పోర్ట్ 
విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు విదేశీ ప్లైట్ 
రూ.611 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం 
రూ.161 కోట్లతో ఇంటర్నేషనల్ టెర్మినల్ బిల్డింగ్ 
రూ.100 కోట్లతో రన్ వే విస్తరణ పనులు
59 ఎకరాలను సమీకరణ
భారీ బోయింగ్ విమానాలు ల్యాండింగ్‌..

విజయవాడ : అంతర్జాతీయ ప్రమాణాలతో విజయవాడ ఎయిర్ పోర్ట్ రూపుదిద్దుకోనుంది. భారీ బోయింగ్ విమానాలు ల్యాండింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. భూ వివాదాలను సత్వరమే పరిష్కరించి .. రన్ వే విస్తరణ పనుల కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. 

విజయవాడ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు విదేశీ ప్లైట్ అందుబాటులోకి తేవడంతో .. తొలి ప్లైట్ సర్వీసు ప్రారంభంతోనే అధికారులు సక్సెస్ అయ్యారు. ఇండిగో విమానయాన సంస్థ వారంలో రెండు రోజుల పాటు సింగపూర్ కు విమానాన్ని నడుపుతోంది. విజయవాడ, గుంటూరు ఏపీ నవ్యాంధ్ర రాజధాని ప్రాంతాలుగా మారడంతో .. ఎయిర్ పోర్ట్ కు డిమాండ్ పెరిగింది. దీంతో ఇతర దేశాలకు సైతం త్వరితగతిన విమాన సర్వీసులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. 

రాష్ట్రంలోని 13 జిల్లాలకు విజయవాడ ఎయిర్ పోర్ట్ కేంద్రం బిందువుగా మారడంతో..  ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే రూ.611 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణంకు శంకుస్ధాపన చేశారు. రూ.161 కోట్లతో ఇంటర్నేషనల్ టెర్మినల్ బిల్డింగ్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. మరో రూ.100 కోట్లతో రన్ వే విస్తరణ పనులు, ఇతరత్రా వాటికి వినియోగిస్తున్నారు. ఎయిర్ పోర్ట్ విస్తరణలో భూములు కోల్పోతున్న వెంచర్ల నిర్వాహకులు, ప్లాట్ల కొనుగోలుదారుల కోసం అజ్జంపూడిలో రెవెన్యూ యంత్రాంగం .. 59 ఎకరాలను సమకూర్చింది. ఈ భూములను చదును చేయించి సీఆర్‌డీఏ ప్లానింగ్ విభాగానికి అప్పగించిన అనంతరం .. లేఅవుట్లు వేసి ప్లాట్లను విభజిస్తారు. 

ఎయిర్ పోర్ట్‌లో ప్రస్తుతం 2286 మీటర్ల మేర రన్ వే ఉంది. దీన్ని అంతర్జాతీయ విమాన సర్వీసుల అవసరం మేరకు 3360 మీటర్లకు విస్తరిస్తున్నారు. రానున్న కాలంలో ఎయిర్ పోర్ట్ నుంచి విదేశీ విమానాలు ప్రారంభించాలంటే వీటికి అనుమతులు లభించాల్సి ఉంది. ఇప్పటికే విదేశాలకు విమానాలు నడపాలని పలు విమానయాన సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. అన్ని అనుకూలంగా ఉంటే విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి దుబాయ్ కు విమాన సర్వీసు ప్రారంభించాలని చూస్తున్నారు.