సెప్టెంబర్ 29 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు

  • Published By: chvmurthy ,Published On : September 22, 2019 / 03:49 PM IST
సెప్టెంబర్ 29 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు

విజయవాడ ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో సెప్టెంబర్ 29, ఆదివారం నుంచి శ్రీ కనకదుర్గ అమ్మవారి  శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు చెప్పారు. 

దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అమ్మవారి దర్శనము త్వరితగతిన కలిగే లాగా అన్ని శాఖల సమన్వయముతో చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం దాదాపు 15 లక్షల మంది అమ్మవారి దర్శనం చేసుకోవచ్చని అంచనా వేసినట్లు ఆయన తెలిపారు.

05-10-2019 తేదీ ఆశ్వయుజ శుధ్ధ సప్తమి, శనివారం, మూలా నక్షత్రం రోజున శ్రీ కనకదుర్గ అమ్మవారు సరస్వతి దేవి రూపములో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆరోజు రాష్ట్ర ప్రభుత్వము తరపున  సీఎం జగన్  అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పిస్తారని వెల్లంపల్లి చెప్పారు.  అక్టోబరు 8వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటలకు కృష్ణానదిలో హంసవాహనం పై  అమ్మవారి తెప్పోత్సవం నిర్వహించనున్నారు. శ్రీకనక దుర్గ అమ్మవారిని 9 రోజులు వివిధ రూపాలతో అలంకరించనున్నారు.

 

సెప్టెంబర్ 29 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు