మానవత్వం నశించింది…నా కూతురు కారుణ్య మరణానికి అనుమతివ్వండి

  • Published By: chvmurthy ,Published On : August 30, 2019 / 04:05 PM IST
మానవత్వం నశించింది…నా కూతురు కారుణ్య మరణానికి అనుమతివ్వండి

విజయవాడ : విజయవాడ ప్రభుత్వాసుపత్రి వైద్యులు రోగులపట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. ఒక రోగికి వైద్యం చేయలేమని చేతులెత్తేయ్యటంతో తమ కుమార్తెను చంపుకోవాలని నిర్ణయించుకుంది ఓ మాతృ హృదయం. తగ్గని వ్యాధితో కళ్ళముందు తన కూతురు పడుతున్న నరకం చూడలేకపోయింది. బతికుండి నరకం అనుభవించే కన్నా చనిపోవటమే బెటర్ అనుకుంది. మనసు రాయి చేసుకుంది. తన బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వమని కోరుతూ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు వినతిపత్రం అందించింది.

వివరాల్లోకి వెళితే… విజయవాడ, సింగ్‌నగర్‌కు చెందిన స్వర్ణలత కూతురు జాహ్నవికి నాలుగేళ్ళ వయసులో ఉండగా అరుదైన మానసిక వ్యాధి సోకింది. ఎనిమిదేళ్ల వయసులో ఆమెకు గైనిక్ సంబంధితమైన ఆరోగ్య సమస్యలూ తలెత్తాయి. ఈ పరిస్ధితుల్లో వైద్యచికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని గైనిక్ విభాగంలో ఆమెను చేర్పించి చికిత్స  చేయిస్తున్నారు. అప్పటినుంచి గత 15 ఏళ్ళుగా ఆమె అక్కడే చికిత్స చేయించుకుంటోంది. అయితే గత కొంతకాలంగా జాహ్నవికి వైద్యం అందించటానికి  ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు నిరాకరిస్తున్నారు. ఆమెకు వైద్యం చేయడం తమవల్ల కాదని డాక్టర్లు చేతులు ఎత్తేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చినా వైద్యురాలు పట్టించుకోలేదని స్వర్ణలత ఆరోపించారు.

వైద్యులు చికిత్స చేయనప్పుడు నాబిడ్డ బతికి ఎందుకు? కూతురి పరిస్థితి చూసి తట్టుకోలేకనే కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నానని తల్లి స్వర్ణలత గవర్నర్‌ను ఆశ్రయించారు. తన కుమార్తెకి వైద్యం అందిస్తారా? లేక కారుణ్య మరణానికి అనుమతిస్తారా? అని ప్రశ్నిస్తూ స్వర్ణలత కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, జాహ్నవి చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోనే ఆమె తండ్రి చిరుద్యోగిగా వున్నారని తెలుస్తోంది.