ముళ్లపొదల్లో పసిగుడ్డు రోదన: బిడ్డను మోసిన తల్లికి పేగు బంధం బరువైందా?

  • Published By: nagamani ,Published On : September 18, 2020 / 11:01 AM IST
ముళ్లపొదల్లో పసిగుడ్డు రోదన: బిడ్డను మోసిన తల్లికి పేగు బంధం బరువైందా?

చెత్తకుప్పల్లో పసిగుడ్డుల రోదనలు..ముళ్లపొదల్లో చీమలు కుట్టి..పురుగులు పాకి..ఎలుకలు కొరికి..అందితే నోటకరుచుకుని పోయే పందులు..కుక్కలు. తల్లి కడుపులోంచి బైటపడిన ఆ పసిప్రాణాలు భూమిమీద పడనక్షణం నుంచి బతకటానికి చేస్తున్న పోరాటం..కన్నతల్లి…ఆ దారుణానికి పాల్పడినవారికి ఆ పసిగుడ్డుల వేదన ఉసురుగా తగలకపోతుందా? అనేటటువంటి ఘటనలు హృదయాలను కదిలించేస్తున్నాయి.


అమ్మ కడుపులోంచి బైటపడిన పురిటి బిడ్డ కదలకపోతేనే ఆ తల్లి ప్రాణం తల్లడిల్లిపోతుందే..అటువంటిది..నవ మాసాలు మోసి కని ఎక్కడో చెత్తను పారేసినట్లుగా పసిగుడ్డుల్ని పారేస్తున్న దారుణ ఘటనలు మానవసమాజాన్ని ప్రశ్నిస్తునే ఉన్నాయి? మమ్మల్ని కనమని మేమడిగామా? సాకలేనివారు ఎందుకు మమ్మల్ని కన్నారు? దీనికి ఈ సభ్య సమాజం ఏం సమాధానం చెబుతుంది?


అసలు సమాధానం చెప్పే ధైర్యం ఈ సమాజానికి ఉందా? అంటే లేదనే చెప్పాలి. ఈ క్రమంలోనే మరో పసిగుడ్డ ఒంటిమీద రక్తపు మరకలు ఆకుండానే ముళ్లపొదలపాలైంది. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మగ శిశువును ముళ్ల పొదల్లో వదిలేసి వెళ్లిపోయారు ఎవ్వరోమరి. వికారాబాద్ పట్టణంలోని నాగుల గుడి ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో అప్పుడే జన్మించిన నవజాత శిశువును ఎవరో గుర్తు తెలియనివారు వదిలేసి వెళ్ళిపోయారు.


బాబు ఏడుపులు విని స్థానికులు వెంటనే బాలుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం చైల్డ్ లైన్ హెల్ప్‌లైన్‌ నంబర్ 1098కు సమాచారం అందించారు. బాబు బరువు 1.8 కిలోగ్రాములు ఉందనీ..ప్రస్తుతం బాబు ఆరోగ్యం బాగానే చైల్డ్ స్పెషలిస్ట్ డాక్టర్ శాంతప్ప తెలిపారు. బాలుడిని తాండూర్ జిల్లా ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ఈ ఘటనపై వికారాబాద్ పోలీసులకు సమాచారం అందడంతో ఆసుపత్రికి వచ్చి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.