గ్రామ వాలంటీర్స్ వేతనం పెంచే యోచనలో జగన్

  • Published By: vamsi ,Published On : October 6, 2019 / 02:13 PM IST
గ్రామ వాలంటీర్స్ వేతనం పెంచే యోచనలో జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన వ్యవస్థ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ. ఇప్పటికే గ్రామాల్లో సేవలు అందిస్తున్న గ్రామ వాలంటీర్లకు ప్రభుత్వం కనీస వేతనం రూ. 5వేలుగా నిర్ణయించింది. అయితే ఇప్పుడు గ్రామ వాలింటర్ల జీతం రూ.5వేలు నుంచి రూ. 8వేలకు పెంచేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోబోతున్నారట.  గ్రామ వాలంటీర్ గౌరవ వేతనం 5,000 నుండి 8,000 పెంచేందుకు రేపు(07 అక్టోబర్ 2019) రాష్ట్ర గ్రామ వాలంటీర్ ప్రధాన కార్యదర్శితో భేటీ కానున్నట్లు తెలుస్తుంది.

గ్రామ వాలంటీర్లు ఆగస్టు 15వ తేదీ నుంచి విధుల్లో చేరగా వారికి సెప్టెంబర్ 30వ తేదీ వరకు జీతాన్ని ప్రభుత్వం అక్టోబర్ 1వ తేదీన చెల్లించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,92,848 మంది వాలంటీర్లకు గాను 1,85,525 మంది వాలంటీర్లు విధుల్లో ఉన్నారు. 1,50,621 మందికి అక్టోబర్ 1వ తేదీన గౌరవ వేతనం 7వేల 500 రూపాయలు పంచాయతీ రాజ్ శాఖ జమ చేసింది. అయితే ఇప్పుడు అలవెన్సులతో కలుపుకుని వారికి రూ. 8వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందట.

గ్రామ వాలంటీర్లు కొందరు లంచాలు వసూలు చేస్తున్నందున ఇది అట్టడుగు స్థాయిలో అవినీతికి దారితీసింది. అవినీతిని మొగ్గలో తుంచేయకుంటే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది అని జగన్ అభిప్రాయపడ్డారు, అందుకే రాష్ట్ర గ్రామ వాలంటీర్ల ప్రధాన కార్యదర్శితో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించి గౌరవవేతనం పెంచాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వంకు సంబంధించిన ప్రతీ పథకాన్ని గ్రామ వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు చేరుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని  మాత్రం అధికారికంగా ప్రకటించలేదు ప్రభుత్వం.