గంగకేమైంది..? : దాహమో రామచంద్ర

  • Published By: madhu ,Published On : March 7, 2019 / 01:06 PM IST
గంగకేమైంది..? : దాహమో రామచంద్ర

ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, రిజర్వాయర్లు ఎండిపోతున్నాయి.. గొంతులు తడారిపోతున్నాయి. విశాఖను తాగునీటి సమస్య కుదిపేస్తోంది. వేసవి రాకముందే జనం దాహమోరామచంద్ర అంటున్నారు. ఓవైపు గంభీరం, మరోవైపు ముడసర్లోవ రిజర్వాయర్లు ఎండిపోవడంతో.. నగరంలోనే కాదు అటు కొండ ప్రాంత వాసులు ఇటు ఏజెన్సీ జనాలు దాహార్తితో అల్లాడుతున్నారు. విశాఖను కుదిపేస్తున్న తాగునీటి సమస్యపై కథనం. 

విశాఖ నగరం నడిఒడ్డు ప్రాంతం. ఆరిలోవ, సీతమ్మధార, ఎఎస్‌ఆర్‌ నగర్‌, పూర్ణమార్కెట్, కొండవాలు ప్రాంత వాసులు, గ్రేటర్ విశాఖలో విలీనమైన 26 గ్రామ పంచాయితీలలో వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. బోర్లు పని చేయక, కుళాయినీళ్లు సరిపోక .. తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. నగర వ్యాప్తంగా 50 వేల నుంచి 60వేల బోర్లు ఉన్నట్లు జీవీఎంసీ లెక్కలు చెబుతున్నాయి. నగరంలో చాలా చోట్ల ప్రస్తుతం వారానికి మూడు రోజులు మాత్రమే నీళ్లోస్తున్నాయి. నగరంలో రెండు రోజులకొకసారి మంచినీటిని సరఫరా చేస్తున్నారు. అది కూడా కేవలం అరగంట మాత్రమే. ఇక నీరు ఏమన్నా బాగుందా అంటే అదీ లేదు. మురుగు నీటితోనే జీవనం సాగించాల్సి వస్తోందని ఆరిలోవ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడిపోతున్నారు. 

విశాఖ జిల్లాకు నీటిని తీసుకువచ్చే ముడసర్లోవ పూర్తిగా ఎండిపోయింది. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో మైదానంలా మారిపోయింది. గత ఏడాది వర్షాలు లేకపోవడంతో నీరు అంతా ఆవిరైపోయింది. రిజర్వాయర్ గరిష్ఠ సామర్థ్యం 169 అడుగులు.. కనీస సామర్థ్యం 152 అడుగులు. ఇక గంభీరం రిజర్వాయిర్లో కూడా ఇదే సీన్. చుట్టుపక్కలు బహుళ అంతస్తుల భవనాలు కార్పోరేట్ ఆసుపత్రులు రావడంతో బోరులో నీరు కూడా రావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 16 ఏళ్లలో ఎప్పుడూ చూడని పరిస్థితి ఇప్పుడు విశాఖ నగరంలో కనిపిస్తోంది.  

నగరంలో 40 ఏళ్ల కిందటితో పోలిస్తే చాలా మార్పులొచ్చాయి. అప్పట్లో వేసవిలో కూడా నగరం చాలా చల్లగా ఉండేది. 30 డిగ్రీల ఉష్ణోగ్రత దాటేది కాదు. ఇప్పుడు వేసవిలో 38-42 డిగ్రీలు దాటుతోంది. నవంబరు, డిసెంబరులో వర్షాలు పడలేదు. నగర వాతావరణంలో వచ్చిన పెనుమార్పులకు ఇవి తార్కాణాలుగా చెప్పొచ్చు. ఇప్పుడు ప్రతీ వేసవిలో ఇలాంటి పరిస్ధితులే ఎదురవుతున్నా.. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో నీటి కష్టాలు ప్రజలను వదలడం లేదు.