వివేకా కేసులో సీబీఐ అక్కర్లేదు.. జగన్ పిటీషన్ మూసివేయండి

  • Published By: vamsi ,Published On : February 7, 2020 / 04:25 AM IST
వివేకా కేసులో సీబీఐ అక్కర్లేదు.. జగన్ పిటీషన్ మూసివేయండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన బాబాయి మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసుపై హైకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. జగన్ తరపు లాయర్ ఈ పిటిషన్‌పై ఇక ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని హైకోర్టుకు వెల్లడించారు. అయితే దీనిపై లిఖితపూర్వకంగా మెమో దాఖలు చేయాలని కోర్టు లాయర్‌కు సూచనలు చేసింది. ఈ మేరకు తదుపురి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

తమ పిటిషన్‌లో తదుపరి ఉత్తర్వులు అవసరంలేదని, దానిని మూసివేయాలని కోరిన జగన్ తరపు న్యాయవాది వాదనలను విన్న న్యాయమూర్తి.. పిటిషన్‌ను ఎందుకు మూసివేయాలని జగన్‌ కోరుతున్నారో కారణాలు వివరిస్తూ తదుపరి విచారణ నాటికి మెమో దాఖలు చేయాలని నిర్దేశించారు. వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐకి ఎందుకు ఇవ్వకూడదో? చెప్పాలని ప్రశ్నించారు. తదుపరి విచారణ 13వ తేదీకి వాయిదా వేశారు.

వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐతో దర్యాప్తు చేయించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఎన్నికలకు ముందు జగన్ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తర్వాత ఈ హత్యపై రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది.. టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలోనే జగన్ సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేయగా.. ఎన్నికల కారణంగా విచారణ కూడా ఆలస్యం అయ్యింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినా నిందితులు మాత్రం దొరకలేదు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీనిపై కొత్తగా సిట్‌ను ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే వివేకా హత్యకేసుపై మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి నర్రెడ్డి ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై కూడా హైకోర్టులో విచారణ జరుగుతోంది.