గెలుపెవరిది : విజయనగరం, బొబ్బిలి రాజ కుటుంబీకులకు ఫలితాల టెన్షన్

  • Published By: veegamteam ,Published On : April 18, 2019 / 12:40 PM IST
గెలుపెవరిది : విజయనగరం, బొబ్బిలి రాజ కుటుంబీకులకు ఫలితాల టెన్షన్

ఎన్నికల ఫలితాలపై ఎవరి ధీమాలో వారు ఉంటున్నా.. అభ్యర్థులకు మాత్రం కంటిమీద కునుకు ఉండటం లేదు. ఈసారి ఎన్నికల్లో ఓటర్ల నాడి ఏమిటో ఎవరికీ అంతుపట్టకపోవడంతో .. అందరూ కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. విజయనగరం జిల్లాలో ఈ పరిస్థితి మరింత వేడి పుట్టిస్తోంది. జిల్లాలో రెండు ప్రధాన పార్టీలకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. పైకి ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా… లోపల మాత్రం టెన్షన్‌తో చచ్చిపోతున్నారు.

విజయనగరం జిల్లాలో రాజ కుటుంబాలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. గతంలో వేర్వేరు పార్టీల్లో ఉన్న రాజులంతా.. ఈ ఎన్నికల్లో ఒకే పార్టీ, ఒకే గుర్తుపై బరిలోకి దిగడం.. కొత్త చర్చకు దారితీసింది. విజయనగరం పూసపాటిరాజులు, బొబ్బిలి రంగారావు, కురుపాం కిశోర్ చంద్రదేవ్‌తో పాటు మేరంగి రాజకుటుంబీకులు .. టీడీపీ తరపున బరిలోకి దిగారు. విజయనగరం ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ పి.అశోక్ గజపతిరాజు పోటీ చేయగా, విజయనగరం అసెంబ్లీ స్థానానికి ఆయన కుమార్తె అదితి గజపతిరాజు బరిలోకి దిగారు. బొబ్బిలి టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు, కురుపాం టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు సోదరి నరసింహప్రియ థాట్రాజ్ పోటీ చేయగా, అరకు ఎంపీ స్థానానికి మాజీ కేంద్ర మంత్రి వైరిచర్ల కిశోర్ దేవ్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాజులంతా ఒకే పార్టీ నుంచి పోటీ చేయడంతో .. ప్రజల దృష్టంతా వీరిపైనే ఉంది. ఫలితాలు వీరికి ఎలా ఉండబోతున్నాయన్నది హాట్ టాపిక్‌గా మారింది. గతంలో జరిగిన పలు ఎన్నికల్లో గెలుపుపై ఎంతో ధీమాగా ఉన్న ఈ రాజకుటుంబాలు.. ఇప్పుడు మాత్రం తెగ టెన్షన్ పడుతున్నాయట.

విజయనగరం అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అదితి గజపతిరాజుకు.. వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి గట్టి పోటీ ఇచ్చారు. విజయనగరం అంటే పూసపాటిరాజులకు కంచుకోట. అలాంటిది ఊహించని విధంగా వైసీపీ అభ్యర్థి గట్టి పోటీ ఇవ్వడంతో .. ఫలితంపై టీడీపీ శ్రేణుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్‌కు ముందు టీడీపీకే విజయావకాశాలున్నాయన్న ప్రచారం జరగ్గా, పోలింగ్ తర్వాత మాత్రం టీడీపీ శ్రేణుల్లో ఆ ఉత్సాహం లేదు. ఎంపీగా అశోక్ గజపతిరాజు బరిలోకి దిగడంతో ఈ అసెంబ్లీ స్థానంలో భారీగా క్రాస్‌ ఓటింగ్ పడినట్లు ప్రచారం జరుగుతోంది. అంటే, ఎంపీ ఓటు అశోక్ గజపతిరాజుకు, అసెంబ్లీ ఓటు కోలగట్లకు క్రాస్‌ ఓటింగ్ పడిందన్న వాదన జరుగుతోంది. దీంతో టీడీపీ శ్రేణులతో పాటు రాజ కుటుంబంలోనూ కొంత నైరాశ్యం ఆవహించినట్లు తెలుస్తోంది. పోలింగ్ జరిగిన తీరుపై అశోక్ గజపతిరాజు సైతం తీవ్ర అసహనంలో ఉన్నట్లు ఆ పార్టీ కేడర్ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఈ పరిస్థితి రావడానికి ఎప్పుడూ అశోక్ గజపతి వెన్నంటి ఉండే ఇద్దరు ప్రధాన అనుచరులే కారణమని, వారిద్దరి మధ్య ఘర్షణ కూడా జరిగిందని సమాచారం. దీంతో ఆగ్రహం చెందిన అశోక్ …వారిని తన బంగ్లాకి రావద్దని కూడా ఆదేశాలు జారీ చేశారట.

బొబ్బిలి నియోజకవర్గంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. వరుసగా మూడు సార్లు హ్యాట్రిక్ విజయాల్ని మూటగట్టుకుని నాలుగోసారి టీడీపీ నుంచి బరిలోకి దిగిన సుజయ కృష్ణ రంగారావు సోదరులు కూడా .. తీవ్ర అసహనంలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలింగ్‌కు ముందు వరకు గెలుపు ధీమాలో ఉన్న బొబ్బిలి రాజ కుటుంబం, పోలింగ్ ముగిసిన తర్వాత పరిస్థితి తలకిందులైందన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన శంబంగి వెంకటచిన అప్పలనాయుడు .. నిన్న మొన్నటి వరకు అంతగా ప్రాధాన్యత లేని నేతగా చెప్పుకున్నారు. గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో .. చివరకు ఆయన జెడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయారు. అటువంటి నేతపై గెలవడం చాలా ఈజీ అనుకున్నారు అందరూ.

కానీ జరిగిన పోలింగ్ సరళిని బట్టి.. బొబ్బిలి రాజుకు గట్టిపోటీయే ఎదురైందన్న ప్రచారం జరిగింది. బొబ్బిలి నియోజకవర్గంపై బొత్స కుటుంబం ఎక్కువగా ఫోకస్‌ పెట్టడం, జగన్‌కు ఉన్న ఇమేజ్ నేపధ్యంలో ఫ్యాన్ గాలి అక్కడ బాగా వీచిందని చెప్పుకుంటున్నారు. దీంతో బొబ్బిలి రాజులకు ఊహించని పరిస్థితి తలెత్తడంతో .. లోలోపలే వారు టెన్షన్ పడుతున్నారట. ఇలాంటి పరిస్ధితుల్లో బొబ్బిలి సోదరుల మధ్య విభేదాలు కూడా తలెత్తాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల్లో డబ్బుల పంపిణీ విషయంలో అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది.

కురుపాంలో విభిన్న పరిస్థితి తలెత్తింది. తొలుత టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే జనార్థన్ థాట్రాజ్‌ .. కుల వివాదం కారణంగా అభ్యర్థిత్వం కోల్పోవాల్సి వచ్చింది. దీంతో డమ్మీగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన తల్లి నరసింహప్రియ థాట్రాజ్ అభ్యర్థిత్వం ఖరారైంది. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఆమె గెలుపు బాధ్యతను భుజాలపై వేసుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పాముల పుష్ప శ్రీవాణి గట్టి పోటీ ఇచ్చారు. ఇక్కడ హోరా హోరీ పోరు జరగడంతో విజయంపై ఇరువర్గాలు తీవ్ర టెన్షన్ పడుతున్నాయి. పోలింగ్ రోజున జియ్యమ్మవలస మండలం చినకుదుమ పోలింగ్ కేంద్రంలో వైసీపీ అభ్యర్థి పుష్పశ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత్ రాజుపై టీడీపీ కార్యకర్తలు దాడిచేయడం దుమారం రేపింది. ఇది కాస్తా శత్రుచర్ల కుటుంబంలో వివాదానికి తెరలేచింది. పోలింగ్ ముగిసిన తర్వాత జిల్లాలో రాజ కుటుంబీకుల విజయావకాశాలపై సర్వత్రా చర్చ నడుస్తుండగా, వారి కుటుంబాల్లో మాత్రం కొత్త వివాదాలకు తెరలేచింది. కౌంటింగ్ తర్వాత వీరి భవిష్యత్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.