వాడెవడండీ బాబూ : EVM రీస్టార్ట్ : 52 ఓట్లు డిలీట్

  • Published By: veegamteam ,Published On : April 11, 2019 / 06:34 AM IST
వాడెవడండీ బాబూ : EVM రీస్టార్ట్ : 52 ఓట్లు డిలీట్

పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలను ఎస్సీ కాలనీలోని పోలింగ్ బూత్ లో విచిత్రమైన ఘటన జరిగింది. ఈవీఎం మొరాయించిందని వీఆర్ఏ దాన్ని రీస్టార్ట్ చేశాడు. దీంతో 52 ఓట్లు డిలీట్ అయ్యాయి. ఈ విషయం తెలిసి ఓటర్లు షాక్ తిన్నారు. తమ ఓట్లు డిలీట్ కావడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఓట్లు డిలీట్ అయిన ఘటన దుమారం రేపింది. విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. వెంటనే ఎన్నికల అధికారులు స్పందించారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీఆర్ఏపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని సస్పండ్ చేశారు. ఈవీఎంలో ఏమైనా లోపాలు వచ్చినా, సాంకేతిక సమస్యలు వచ్చినా వాటిని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ఈవీఎంలను ఎవరు పడితే వారు ముట్టుకోవడానికి వీల్లేదు. ఇవేమీ పట్టించుకోకుండా వీఆర్ఏ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఈవీఎంను రీస్టార్ట్ చేసి ఓట్లు డిలీట్ కావడానికి కారణమయ్యాడు.

తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తొలి దశ ఎన్నికల పోలింగ్‌లో ఈవీఎంల మొరాయింపుపై విమర్శలు వస్తున్నాయి. గురువారం(ఏప్రిల్ 11,2019) ఉదయం 7 గంటలకే పోలింగ్‌ మొదలవగా.. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. సాంకేతిక సమస్యలతో ఈవీఎంలు పని చేయలేదు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది ఓటు వెయ్యకుండానే వెనక్కి వెళ్లిపోయారు. సాక్షాత్తూ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఓటు వేసేందుకు వెళ్లిన చోటే వీవీప్యాట్‌ మొరాయించింది. ఈసీ తీరుపై సామాన్యులు, నేతలు అసంతృప్తి వ్యక్తంచేశారు. చంద్రబాబు, రఘువీరారెడ్డి, నిజామాబాద్‌ ఎంపీ కవిత విమర్శలు చేశారు. చాలా చోట్ల ఈవీఎంలు పనిచేయక పోవటంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈవీఎంలు దుర్వినియోగమవుతాయని ఎప్పటి నుంచో చెబుతున్నామని అన్నారు. బ్యాలెట్‌తో ఏ సమస్యా ఉండదని చెప్పినా కేంద్రం, ఈసీ వినలేదన్నారు. ఈవీఎంల వల్ల నష్టాన్ని ఇప్పటికైనా గుర్తించాలన్నారు. ఈవీఎంలపై రివిజన్ పిటిషన్ వేసే విషయంపై ఆలోచిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.