టీడీపీకి తలనొప్పి: రెబల్‌గా బరిలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే

  • Published By: vamsi ,Published On : March 20, 2019 / 03:17 AM IST
టీడీపీకి తలనొప్పి: రెబల్‌గా బరిలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే

అనంతపురం తెలుగుదేశం పార్టీలో లుకలుకలు అధికార తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా తయారైంది. కల్యాణదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానంటూ ప్రకటించారు. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున కళ్యాణదుర్గం నుంచి హనుమంతరాయ చౌదరి గెలవగా.. ఈసారి మాత్రం ఆయనకు టిక్కెట్ ఇవ్వకుండా ఉమా మహేశ్వర నాయుడుకు టిక్కెట్ ఇచ్చారు.

దీంతో అలకబూనిన హనుమంతరాయ చౌదరి టీడీపీ రెబల్ అభ్యర్ధిగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. తన సత్తా ఏమిటో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిలకు చూపిస్తానంటూ సవాల్ చేశారు. తనకు పార్టీ తీరని ద్రోహం చేసిందని, 25వ తేదీన ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసి ప్రచారం చేస్తానంటూ హనుమంతరాయ చౌదరి ప్రకటించారు. 
కళ్యాణ దుర్గం నియోజకవర్గం అనంతపురం పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. ఈ నియోజకవర్గం ఫలితం తేడా అయిదంటే.. అనంతపురం పార్లమెంట్ సీటు మీద ఎఫెక్ట్ పడుతుందనే ఉద్దేశ్యంతో జేసీ దివాకర్ రెడ్డి హనుమంతరాయ చౌదరిని తప్పించేందుకు పావులు కదిపినట్లు చెబుతున్నారు. ఈ నియోజకవర్గం నుండి వైసీపీ తరుపున కేవీ ఉషశ్రీ చరణ్‌ను జగన్ బరిలోకి దింపారు. దీంతో ప్రధాన పోటీదారులు ఇద్దరు కొత్తవారే అయ్యారు. పీసీసీ ఛీఫ్ రఘువీరా రెడ్డి కూడా ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు.