వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం: వేదికపైనే మంత్రికి కౌంటర్

  • Published By: vamsi ,Published On : September 30, 2019 / 01:45 PM IST
వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం: వేదికపైనే మంత్రికి కౌంటర్

విశాఖ జిల్లాలో బహిరంగ వేదికపైనే మంత్రికి, వైసీపీ నేతకు మధ్య మాటల యుద్ధం జరిగింది. సచివాలయ ఉద్యోగుల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేతలు ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. సాక్షాత్తు మంత్రి అవంతి శ్రీనివాస్ కు ఆ పార్టీ సీనియర్ నేత ద్రోణంరాజు చురకలు అంటించారు.

అవంతి విశాఖకు వలస వచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు అని అన్న ద్రోణం రాజు.. మాట్లాడే ముందు చిన్నా పెద్దా చూసుకోవాలని మంత్రి అవంతికి వేదికపైన సూచించారు. అంతకుముందు అవంతి మాట్లాడుతూ.. గ్రామస్తుల కష్టాలు తెలియవంటూ వ్యాఖ్యానించారు.

దీనిపై స్పందించిన ద్రోణం రాజు.. సమస్యలపై పూర్తిగా అవగాహన ఉందని, అందుకే ఎమ్మెల్యేగా ఓడినా తనకు సీఎం జగన్ నామినేటెడ్ పదవి ఇచ్చారని అన్నారు. వలస వచ్చిన నేతలకు కావాలంటే ఆ పదవిని కూడా ఇచ్చేస్తానని అన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌ను ఉద్దేశించి పరోక్షంగా ఈ మాటలు అన్నారు.

వైసీపీకి చెందిన ఇద్దరు ముఖ్యనేతల మధ్య మాటల యుద్ధంతో పార్టీలోని నాయకులు కాస్త అయోమయానికి గురయ్యారు. ఈ క్రమంలో విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయం సాధించాలని పట్టుదలగా ఉన్న వైసీపీ నాయకత్వం నాయకుల మధ్య సమన్వయం కోసం చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.