శ్రీశైలం డ్యాం దగ్గర నీటి కుక్కలు : వీడియోలు తీస్తున్న సందర్శకులు

  • Published By: chvmurthy ,Published On : September 13, 2019 / 07:15 AM IST
శ్రీశైలం డ్యాం దగ్గర నీటి కుక్కలు : వీడియోలు తీస్తున్న సందర్శకులు

కర్నూలు జిల్లా శ్రీశైలం డ్యాం వద్ద నీటి కుక్కలు సందడి చేస్తున్నాయి. ఎగువున కురుస్తున్న వర్షాలతో వరదనీరు జలాశయంలోకి వచ్చిచేరుతోంది. భారీ వేగంతో నీరు విడుదల అవుతున్న సందర్భంలో నీటి కుక్కల సందడి చూపరులను ఆకట్టుకుంటోంది.

డ్యామ్ వద్ద ఉన్న 4, 6 క్రస్ట్ గేట్ల మధ్య .. నాలుగు నీటి కుక్కలు .. నీటిలో మునుగుతూ, తేలుతూ, నీటికి ఎదురీదుతూ .. కొంతసేపు సందడి చేశాయి. డ్యామ్  వద్ద నీటి విడుదలను చూడటానికి వచ్చి సందర్శకులు  .. నీటి కుక్కల విన్యాసాలు కనిపించడంతో వాటి వీడియోలు, ఫోటోలు తీస్తూ ఎంతో వినోదాన్ని పొందారు.

కాగా….ఎగువున కురుస్తున్న  వర్షాలతో శ్రీశైలం జలాశయానికి  మళ్ళీ భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. ఎగువున ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి 2,38,710 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 67,872 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 8 క్రస్టు గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి 2,23,864 క్యూసెక్కుల నీటిని  కిందకు విడుదల చేస్తున్నారు.