శ్రీవారి ఆభరణాలపై శ్వేత పత్రం విడుదల చేస్తాం

  • Published By: chvmurthy ,Published On : August 26, 2019 / 03:18 PM IST
శ్రీవారి ఆభరణాలపై శ్వేత పత్రం విడుదల చేస్తాం

తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆభరణాల లెక్కపై పాలక మండలి ఏర్పడిన తర్వాత శ్వేత పత్రం విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. పాలక మండలి ఏర్పడ్డాక స్వామివారి ఆభరణాల తరలింపు అంశం, తిరుమలలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన అంశంపైనా విచారణ కమిటీ నియమించి శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు. 10 టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో వైవీ సుబ్బారెడ్డి కీలక విషయాలు చెప్పారు.

అసలు స్వామి వారికి ఉండాల్సిన ఆభరణాలు ఎన్ని, ఇప్పుడు ఎన్ని ఉన్నాయో వివరాలు తెలుపుతామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. మరొక అంశంలో అప్పటి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా స్వామివారి బంగారు ఆభరణాలు తరలించారని ఆరోపించారు.  

2019 లో జరిగిన ఎన్నికల సమయంలో స్వామి వారికి చెందిన బంగారం తమిళనాడు నుంచి వస్తుండగా పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఆరోపణలన్నింటిపైనా పాలక మండలి ఏర్పడిన తర్వాత కమిటీ వేసి విచారణ చేయిస్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.