వీకెండ్ జర్నీ : తిరుమల కిటకిట

  • Published By: madhu ,Published On : May 13, 2019 / 01:14 AM IST
వీకెండ్ జర్నీ : తిరుమల కిటకిట

కలియుగ వైకుంఠం కిటకిటలాడుతోంది. ఏడుకొండలపై కొలువైన వెంకన్న దర్శనానికి భక్తజనం బారులుతీరారు. లక్షల మంది తరలివచ్చి… శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో ఎదురు చూస్తున్నారు. వేసవి సెలవులతో పాటు వీకెండ్ కావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడింది. దీంతో టిటిడి అధికారులు శ్రీవారి ఆలయంలో భక్తులకు అసౌకర్యం కలుగకుండా వీలైనంత త్వరగా దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు.

తలనీలాలు సమర్పించేందుకు భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా… ప్రధాన కల్యాణకట్ట, మినీ కల్యాణ కట్టల్లో ఆదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి 24 గంటలు సేవలు అందిస్తున్నారు. తిరుమలలో బస కల్పించేందుకు విశ్రాంతి భవనాల్లోని గదుల వివరాలను ఎప్పటికప్పుడు రేడియో, బ్రాడ్‌కాస్టింగ్‌ ద్వారా భక్తులకు తెలియచేస్తున్నారు. భక్తులకు అవసరమైనన్ని లడ్డూలను అందుబాటులో ఉంచారు.

నారాయణగిరి ఉద్యానవనాలలోని సర్వదర్శనం, దివ్యదర్శనం క్యూలైన్లు మరియు ఒకటి, రెండు వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని కంపార్టుమెంట్లలో భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, చిన్నపిల్లలకు పాలను శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరం పంపిణీ చేస్తున్నారు. తిరుమలలో పారిశుద్ధ్యం లోపించకుండా ఆరోగ్యవిభాగం ఆధ్వర్యంలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు. టిటిడి ఇంజినీరింగ్‌, నిఘా, భద్రతా సిబ్బంది, పోలీసులు పటిష్టమైన భద్రత కల్పించడంతోపాటు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు.

వేసవి సెలవుల్లో విచ్చేసిన లక్షలాదిమంది భక్తులకు టిటిడి అధికారులు, సిబ్బందితో పాటు 3,500 మంది శ్రీవారి సేవకులు, 500 మంది స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సేవలందిస్తున్నారు. వైకుంఠం క్యూ కంప్లెక్స్‌లో భ‌క్తుల సౌక‌ర్యాల ప‌ర్యవేక్ష‌ణ‌కు 70 మంది పిడ‌బ్ల్యుఎఫ్ఎస్ సేవ‌కులు పనిచేస్తున్నారు. అదేవిధంగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, రెండవ యాత్రికుల వసతి సముదాయం వెలుపల క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్న‌ప్ర‌సాదాలు అందిస్తున్నారు. సిఆర్‌ఓ, రాంభగీచా బస్టాండు, హెచ్‌విసి, ఏఎన్‌సి ప్రాంతాల్లోని ఫుడ్‌ కౌంటర్ల ద్వారా అన్న‌ప్ర‌సాదాలు, అల్పాహారం, పాలు విత‌ర‌ణ చేస్తున్నారు. మే 11వ తేదీ శనివారం ఒక్కరోజే 95 వేల 16 మంది భ‌క్తులు శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు.