చంద్రబాబు ఎన్నికల వ్యూహాలేంటి

ప్రతి ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో నిర్ణయాలు తీసుకొనే చంద్రబాబు.. ఈ సారి ధైర్యం చేస్తారా..? ఆయన ఎన్నిక‌ల వ్యూహం  ఏంటి? ప్రస్తుతం  టీడీపీ వర్గాల్లో ఇదే అంశం చ‌ర్చనీయాంశంగా మారింది.

  • Published By: veegamteam ,Published On : January 3, 2019 / 11:23 AM IST
చంద్రబాబు ఎన్నికల వ్యూహాలేంటి

ప్రతి ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో నిర్ణయాలు తీసుకొనే చంద్రబాబు.. ఈ సారి ధైర్యం చేస్తారా..? ఆయన ఎన్నిక‌ల వ్యూహం  ఏంటి? ప్రస్తుతం  టీడీపీ వర్గాల్లో ఇదే అంశం చ‌ర్చనీయాంశంగా మారింది.

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు మాటమీద నిలబడతారా? గ‌తంలో చెప్పినట్టు  సంక్రాంతికి ముందస్తుగా అభ్యర్ధుల‌ను ప్రక‌టిస్తారా? ప్రతి ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో నిర్ణయాలు తీసుకొనే చంద్రబాబు.. ఈ సారి ధైర్యం చేస్తారా..? ఆయన ఎన్నిక‌ల వ్యూహం  ఏంటి? ప్రస్తుతం  టీడీపీ వర్గాల్లో ఇదే అంశం చ‌ర్చనీయాంశంగా మారింది.

పంచాయతీ, పార్లమెంట్‌… ఎన్నికలేవైనా టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు వాటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారు. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టుగా.. రాజ‌కీయ వ్యూహాలు ర‌చిస్తారు. ప్రస్తుతం చంద్రబాబుకు రెండు అంశాలు సవాలుగా మారాయి. ఒక‌టి  కేంద్రంలో ప్రభుత్వాన్ని  మార్చడం, రెండు రాష్ట్రంలో తిరిగి  అధికారంలోకి రావ‌డం. తన ముందున్న ఈ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేందుకు చంద్రబాబు తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో చాలా మందిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. వారినే కొనసాగిస్తే.. ప్రజాతిరస్కారం తప్పదు. ఈ విషయాన్ని ముందే గ్రహించిన చంద్రబాబు పరిష్కార మార్గాలపై దృష్టిపెట్టారు. తెలంగాణాలో శాస‌న స‌భ్యుల‌పై కొంత వ్యతిరేక‌త ఉన్నా  కేసీఆర్ పై నమ్మకంతో  ప్రజలు తిరిగి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే ఏపీలో ప‌రిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దీంతో చంద్రబాబు అభ్యర్ధుల ఎంపికపై ప్రధానంగా ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తన సహజ శైలికి భిన్నంగా 2019ఎన్నికల్లో ముందస్తుగా అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విషయంపై చంద్రబాబు ప్రకటన కూడా చేశారు. అయితే ఆచ‌ర‌ణ‌లో ఇది ఎంత‌వర‌కు సాధ్యమన్నదానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎన్నికల నేపథ్యంలో.. ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు సర్వే చేయించారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, పనితీరు మెరుగుపరుచుకోకుంటే.. ఫైర్ తప్పదని కొందరు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేల జాతకమంతా నా వద్ద ఉందంటూ అయన బహిరంగంగానే ప్రకటించారు. ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్‌ ను వడపోసిన చంద్రబాబు.. చివరకు 40మందిని మార్చాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 40 మందిని మారిస్తే 40 మంది రెబెల్స్ ను త‌యారు చేసుకున్నట్టే అనే విష‌యం  బాబుకు తెలుసు. అయితే సుదీర్ఘ ప్రయోజ‌నాల కోసం  ఇది త‌ప్పనస‌రి. అభ్యర్ధుల‌్లో కొంత మ‌ంది ని ముందుగానే ప్రక‌టిస్తే కొంత వ‌ర‌కు జ‌నంలోకి వెళ్లే అవ‌కాశం ఉంటుంద‌ని చంద్రబాబు భావిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేక‌త , సామాజిక  నేప‌థ్యం, ఆర్ధిక ప‌రిస్థితి ఇవ‌న్నీ ద్రుష్టిలో పెట్టుకుని ఈ సారి చంద్రబాబు  టికెట్లు ఇవ్వనున్నారు. ముందస్తు అభ్యర్ధుల ప్రకటన అంటూ చేస్తే..  ఈ నెల‌లో 40 నుంచి  50 మందితో ఫస్ట్‌ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు జ‌న‌సేన‌తో పొత్తు విష‌యంలో చంద్రబాబు ఆచి తూచి మాట్లాడారు. ఒక వేళ ఎన్నిక‌ల‌కు ముందే పొత్తు ఉంటే కన‌ుక వారికి కూడా కొన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ పొత్తుపై క్లారీటీ ఇవ్వకున్నా ఇద్దరు నేతలు కొట్టి పారేయ‌క‌పోవ‌డం భవిష్యత్ రాజకీయాలపై ఆస‌క్తి రేపుతోంది. రాబోయే రోజుల్లో ప‌రిణామాలు ఎలా మారతాయోనన్న అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మొత్తానికి  ఈ సారి ఎన్నికలు టీడీపీకి అగ్నిపరీక్షనే చెప్పాలి. అభ్యర్దుల ఎంపిక వ్యవ‌హారం చంద్రబాబుకు సవాల్‌గా మారనుంది. టికెట్ల విషయంలో గతానికి భిన్నంగా చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారా.. రొటీన్‌గా వెళతారా అన్నది చూడాలి.