నెల్లిమర్లలో గెలుపెవరిది?

  • Published By: veegamteam ,Published On : May 16, 2019 / 04:07 PM IST
నెల్లిమర్లలో గెలుపెవరిది?

విజయనగరం జిల్లాలో కీలకమైన నెల్లిమర్ల నియోజకవర్గంలో క్రమంగా మళ్లీ రాజకీయ సెగ రాజుకుంటోంది. పోలింగ్ తర్వాత సుదీర్ఘ విరామం రావడంతో కొన్ని రోజులపాటు అభ్యర్థులు కూల్‌ అయినప్పటికీ.. కౌంటింగ్ తేదీ సమీపిస్తుండటంతో మళ్లీ వాతావరణం వేడెక్కింది. విజయంపై ఎవరి లెక్కలు వారు వేసుకున్నప్పటికీ.. లోలోపల మాత్రం టెన్షన్‌తో కొట్టుమిట్టాడుతున్నారు. 

విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు బరిలో ఉండగా.. వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు పోటీ చేశారు. జనసేన అభ్యర్థి బరిలో ఉన్నప్పటికీ, పోటీ నామమాత్రంగానే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ద్విముఖ పోటీ నెలకొంది. పోలింగ్ సరళిని బట్టి ఇక్కడ గెలిచేదెవరు అన్న విషయం స్పష్టత రాకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

పతివాడ నారాయణస్వామినాయుడు రాజకీయ కురువృద్ధుడుగా, సీనియర్ ఎమ్మెల్యేగా అందరికీ సుపరిచితులు. ఇప్పటికే ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. ఇప్పుడు మరోసారి బరిలో నిలబడి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో సీనియర్ నేతగా, నిరాడంబర వ్యక్తిగా గుర్తింపు పొందారు పతివాడ. నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేశారన్న పేరు సంపాదించారు. రహదారుల అభివృద్ధి, మంచినీరు, విద్య వంటి మౌలిక సదుపాయాల కల్పనలో పతివాడ ముందంజలో ఉన్నారని చెప్పొచ్చు. దీనికి తోడు టీడీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలు తనకి అనుకూలంగా మారాయని పతివాడ భావిస్తున్నారు. 

ఎనిమిది సార్లు పోటీ చేసి, ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపొందిన పతివాడ…ప్రస్తుతం వయోభారంతో బాధపడుతున్నారు. దీంతో క్రమంగా పార్టీ కేడర్‌కు దూరం అయ్యారన్న విమర్శలు వచ్చాయి. గత ఐదేళ్లలో తన చిన్న కుమారుడు తమ్మినాయుడు తండ్రి నీడన అవినీతి, అక్రమాలకు తెరతీశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే పతివాడ వయోభారం నేపథ్యంలో ఈసారి యువనాయకత్వానికి టికెట్టు వస్తుందని ఆశించిన నేతలకు నిరాశే మిగిలింది. ఇలా భంగపడ్డ నేతలు ఈసారి ఎన్నికల్లో చురుగ్గా పనిచేయలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. 

టీడీపీ కేడర్‌ అసంతృప్తితో నియోజకవర్గంలో వైసీపీ బలపడిందనే చర్చలు మొదలయ్యాయి. అన్ని మండలాల్లలోనూ గతంలో కంటే వైసీపీ ఓటు బ్యాంకు పెరిగిందని.. ఫలితంగా తమ గెలుపు ఖాయమంటూ వైసీపీ అభ్యర్థి బడుకొండ అప్పలనాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ టికెట్టు వ్యవహారంలో పలుపేర్లు తెరపైకి వచ్చినప్పటికీ.. చివరికి అప్పలనాయుడికే ఖరారైంది. సీనియర్ నేత బొత్సకు సమీప బంధువైన బడుకొండకు నియోజకవర్గంలో మంచి పట్టుంది. బలమైన కేడర్ ఉంది. ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేత కావడంతో బడుకొండ ఈసారి గట్టి పోటీ ఇచ్చారు. గతంలో ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధితోపాటు.. ఎప్పుడు ఎవరికి ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉంటారన్న భరోసా ప్రజల్లో ఉందని.. ఈ నేపథ్యంలోనే ఈసారి తనపై ఓటర్లు అభిమానం చూపించారని అప్పలనాయుడు చెబుతున్నారు. నూటికి 200శాతం తన గెలుపు ఖాయమంటూ ధీమాగా చెబుతున్నారు. 

మరోవైపు నెల్లిమర్ల నియోజకవర్గంలో పోలింగ్ సరళి అందరినీ కన్ఫ్యూజన్‌లో పడేసింది. ఇక్కడ హోరాహోరీ పోటీ నెలకొనడంతో ఓటర్ల నాడి ఎవరికీ అంతు చిక్కడంలేదు. ఈ నేపథ్యంలో ఎవరు గెలిచినా మూడు నుంచి ఐదు వేల మెజార్టీ మాత్రమే వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. కౌంటింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ.. అభ్యర్థులు ఎవరికి వారు లెక్కలు వేసుకోవడంలో మునిగితేలుతుండగా.. నియోజకవర్గ ప్రజలు మాత్రం ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.