నా ఓటు ఎక్కడ ? ఆత్మహత్య చేసుకుంటా

  • Published By: madhu ,Published On : April 11, 2019 / 08:24 AM IST
నా ఓటు ఎక్కడ ? ఆత్మహత్య చేసుకుంటా

నా ఓటు ఏమైంది ? ఓటును ఎవరు తొలగించారు ? సాయంత్రంలోగా ఓటు హక్కు కల్పించకపోతే ఆత్మహత్య చేసుకుంటా అంటూ ఓ మహిళ హెచ్చరించింది. పెట్రోల్ బాటిల్ బయటకు తీసి హల్ చల్ చేసింది. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటా అంటూ బెదిరింపులకు దిగింది. కర్నూలు జిల్లా ఆదోనిలో ఈ ఘటన జరిగింది. గురువారం(ఏప్రిల్ 11, 2019) ఏపీలో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఆదోనిలో ఓటు వేసేందుకు ఓ మహిళ పోలింగ్ కేంద్రం దగ్గరికి వచ్చింది. అక్కడున్న సిబ్బంది.. ఓటర్ జాబితాలో నీ పేరు లేదు, ఓటు వెయ్యడానికి కుదరదు అని ఆమెకు చెప్పారు.

దీంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురైంది. నా ఓటు ఏమైందో చెప్పాలని అధికారులను ప్రశ్నించింది. పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన ఆమె.. తన వెంట తెచ్చుకున్న బ్యాగు నుండి పెట్రోల్ బాటిల్ తీసింది. సాయంత్రంలోగా ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేసింది. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. మూడు రోజుల నుండి చెబుతున్నా..ఎవరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళ తీరుతో అక్కడున్న పోలింగ్ సిబ్బంది, అధికారులు కంగారు పడ్డారు. ఆందోళన చెందారు. తర్వాత ఆమెకు సర్ధి చెప్పి అక్కడి నుంచి పంపేశారు.