అల్లర్లు, అరాచకాలు సృష్టించటం చంద్రబాబుకు అలవాటే : రోజా

  • Published By: chvmurthy ,Published On : January 7, 2020 / 09:59 AM IST
అల్లర్లు, అరాచకాలు సృష్టించటం చంద్రబాబుకు అలవాటే : రోజా

రైతుల ముసుగులో టీడీపీ నాయకులు ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై దాడి చేశారని నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా ఆరోపించారు.  ముందస్తు ప్రణాళిక రూపోందించుకునే టీడీపీ గూండాలు పిన్నెల్లిపై దాడి చేశారని ఆమె అన్నారు. పిన్నెల్లిపై దాడి అనంతరం  ఆమె విలేకరులతో మాట్లాడుతూ … ఏపీ రాజధాని అమరావతి మీద ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు  గెజిట్ నోటిఫికేషన్ ఎందుకివ్వలేదని నగరి ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. అమరావతి రైతులను అన్నిరకాలుగా మోసం చేసి సర్వ నాశనం చేసిన చంద్రబాబు నాయుడు  ఈరోజు రైతుల మీద, అమరావతి మీద ప్రేమ ఉన్నట్లు ..రాజధాని ఏదో అయిపోతున్నట్లు తన అనుకూల మీడియాలో అసత్య  ప్రచారం చేయిస్తూ గగ్గోలు పెడుతున్నాడని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృధ్ది చెందాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి 3రాజధానుల అంశాన్ని అమలు చేస్తున్నారని ఆమె అన్నారు.  మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పై జరిగిన దాడిని ఆమె ఖండించారు. 

ప్రాంతీయ విభేదాలు రాకూడదని సీఎం జగన్ చిన్నవాడైనా పెద్ద మనసుతో ఆలోచిస్తున్నారని రోజా అన్నారు.   ఇంతకు మునుపు అభివృధ్ది అంతా హైదరాబాద్ లో డెవలప్ అవటం వల్ల తెలంగాణ వాళ్లు తరిమేస్తే రాజధాని లేకుండా ఆంధ్రులు ఇక్కడకు  రావల్సి వచ్చిందని..మళ్లీ అభివృధ్ది అంతా ఒకే చోట ఉంటే మళ్లీ ఉత్తరాంధ్ర ఉద్యమం కానీ, రాయలసీమ ఉద్యమం కానీ వచ్చే అవకాశం ఉంటుదని…అలాంటి పరిస్ధితులు తలెత్తకుండా చిత్తశుధ్దితో ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. టీడీపీ వాళ్ళు ఇలాంటి అరాచకాలు ఎందుకు సృష్టిస్తున్నారో రైతులు ఆలోచించాలని ఆమె కోరారు. 20 రోజులుగా రైతులు ధర్నా చేస్తే ఏమైనా కేసులుపెట్టామా అని ఆమె ప్రశ్నించారు.

రాజధాని గురించి పిన్నెల్లి ఎప్పుడైనా మాట్లాడారా .. అలాంటి మనిషిపై దాడి చేయాల్సిన అవసరం వచ్చిందని ఆమె అన్నారు.  తన రాజకీయ లబ్ది కోసం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, పరిటాల రవి హత్యానంతరం ఎలాంటి అరాచకాలు సృష్టించారో చూశాం అని ఆమె వివరించారు. అల్లర్లు అరాచకాలు సృష్టించడం ..దాన్ని తన స్వప్రయోజనాలకు వాడుకోవటం చంద్రబాబుకు  అలవాటేనని రోజా ఆరోపించారు.  సీఎంజగన్ 13 జిల్లాలకు న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నారని రోజా తెలిపారు. 

Also Read : చంద్రబాబు నువ్వు మగాడివైతే రా..: పిన్నెల్లి

గుంటూరు జిల్లా చినకాకాని దగ్గర రైతులు చేపట్టిన రహదారుల దిగ్భంధంలో ఉద్రిక్తత నెలకొంది. మాచర్ల ఎమ్మెల్యే, విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రాజధాని సెగ తాకింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఎమ్మెల్యే  పిన్నెల్లి కారుని అమరావతి రైతులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కారు నుంచి కిందకు దిగకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు ముందు బైఠాయించారు. ఈ క్రమంలో కొందరు.. రాళ్లతో కారుపై దాడి చేశారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే సెక్యూరిటీ సిబ్బందిపైనా చేయి చేసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని రైతులు నినాదాలు చేశారు. ఆందోళనకారుల నుంచి తప్పించుకునే క్రమంలో ఎమ్మెల్యే కారు మరో కారుని ఢీకొట్టింది. చివరికి.. ధ్వంసమైన కారులోనే ఎమ్మెల్యే పిన్నెల్లి వెనుదిరగాల్సి వచ్చింది.

Also Read : ఉద్యమాన్ని అణచాలని చూస్తే బలంగా ఆందోళనలు చేస్తారు