టీడీపీ, జనసేన ఒక్కటే అనే అనుమానాలు కలుగుతున్నాయి

  • Published By: veegamteam ,Published On : April 9, 2019 / 07:03 AM IST
టీడీపీ, జనసేన ఒక్కటే అనే అనుమానాలు కలుగుతున్నాయి

గుంటూరు : టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ లపై వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ తీరు చూస్తుంటే.. టీడీపీ, జనసేన ఒక్కటే అనే అనుమానాలు కలుగుతున్నాయని జగన్  అన్నారు. పవన్ ని చంద్రబాబు పార్టనర్ అన్న జగన్.. వారిద్దరికి లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో జగన్ ఎన్నికల ప్రచారం చేశారు. చంద్రబాబు  పార్టనర్ పవన్ కల్యాణ్ పోటీ చేసే గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో చంద్రబాబు కానీ ఆయన కుమారుడు లోకేష్ కానీ ప్రచారం చెయ్యరు అని జగన్ అన్నారు. అదే విధంగా చంద్రబాబు పోటీ చేసే కుప్పంలో.. లోకేష్  పోటీ చేసే మంగళగిరిలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చెయ్యరు అని జగన్ మండిపడ్డారు. ఇది చూస్తుంటే టీడీపీ, జనసేన పార్టీలు వేర్వేరు కాదు ఒక్కటే అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయని జగన్  చెప్పారు.

చంద్రబాబు, ఆయన పార్టనర్‌.. ఎల్లో మీడియా చేసే కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించారు. వైసీపీ అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని జగన్ హామీ ఇచ్చారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కే)తో పాటు గుంటూరు లోక్‌సభ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డిలను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఎన్ని కుట్రలు చేసినా.. చంద్రబాబు ఓటమి ఖాయమని జగన్ అన్నారు. 10 ఎల్లో మీడియా చానెళ్లు మైకులు పట్టుకుని ప్రచారం చేసినంత మాత్రాన చంద్రబాబు చేసిన మోసాలు మంచివి అయిపోతాయా? అని జగన్ ప్రశ్నించారు.