సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసు సీబీఐకి అప్పగింత

ఏపీలో సంచలనం సృష్టించిన సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణను కోర్టు సీబీఐకి

  • Published By: veegamteam ,Published On : March 11, 2020 / 09:10 AM IST
సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసు సీబీఐకి అప్పగింత

ఏపీలో సంచలనం సృష్టించిన సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణను కోర్టు సీబీఐకి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించింది కోర్టు. ఈ కేసులో నాలుగు పిటిషన్లు విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. సాధ్యమైనంత త్వరగా దర్యాఫ్తు పూరి చేయాలని, పులివెందుల పోలీస్ స్టేషన్ నుంచి దర్యాఫ్తు ప్రారంభించాలని కోర్టు ఆదేశించింది. హత్య జరిగి ఏడాది కావొస్తున్నా దర్యాఫ్తులో పురోగతి లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు దర్యాఫ్తులో సమయం కీలకం కాబట్టి సీబీఐకి అప్పగిస్తున్నామని చెప్పింది. సీఎం జగన్ సీబీఐ దర్యాఫ్తు పిటిషన్ ఉపసంహరణ ప్రభావం విచారణపై ఉండకూడదని కోర్టు వ్యాఖ్యానించింది.

బుధవారం(మార్చి 11,2020) పిటిషన్లు విచారించిన కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత, టీడీపీ నేత బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. అనంతరం కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

అసలేం జరిగిందంటే:
2019 మార్చి 15న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా 25 రోజుల ముందు వైఎస్ వివేకానందరెడ్డి కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఆయన్ను కిరాతకంగా హతమార్చారు. ఈ హత్యకు టీడీపీ ప్రభుత్వమే కారణమని అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఆరోపించారు

సిట్ వేసిన చంద్రబాబు:
అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయగా.. విచారణలో ఆశించిన పురోగతి లేకపోవడం, హంతకులేవరో తేల్చకపోవడంతో.. సీబీఐతో విచారణ జరిపించాలని వివేకా భార్య, జగన్ సహా పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 62మంది సాక్షులను సిట్ విచారించినప్పటికీ, నేరస్తులు ఎవరనే దిశగా ఆధారాలు సేకరించలేకపోయింది.

సీబీఐ విచారణకు వివేకా కూతురు డిమాండ్:
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ కేసులో పురోగతి సాధించ లేదని పిటిషనర్ల ఆరోపణ. ఈ నేపథ్యంలో వివేకా కూతురు సునీత కేసును సీబీఐకి అప్పగించాలంటూ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ సమయంలోనే కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్‌ను సీఎం జగన్ ఉపసంహరించుకున్నారు. దీనిపై సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకుని టీడీపీ విమర్శలు చేస్తోంది.

వీడని మర్డర్ మిస్టరీ:
ఏడాది కావొస్తున్నా నేటికీ వైఎస్ వివేకా మర్డర్ కేసులో మిస్టరీ వీడకపోవడం చర్చనీయంశంగా మారింది. సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని, త్వరిత గతిన విచారణ జరిపించాలని, కేసును సీబీఐకి ఇవ్వాలని వేసిన పిటిషన్లపై ధర్మాసనం సుధీర్ఘంగా విచారించింది.  వివేకా హత్య కేసుని సీబీఐకు అప్పగించాలంటూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి, వివేకా భార్య సౌభాగ్యమ్మ, వివేకా కూతురు సునీత పిటీషన్లు వేశారు. బీటెక్ రవి తరఫున కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసు విచారణలో రాష్ట్ర పోలీసులు సమర్థంగా వ్యవహరించ లేదని, ఈ కేసులో ఇద్దరు కింది స్థాయి పోలీసులను సస్పెండ్ చేశారని, ఇప్పటివరకు కేసులో పురోగతి లేదని పేర్కొన్నారు. అందుకే వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.

టీడీపీ, వైసీపీ మాటల యుద్ధం:
2020 మార్చి 15వ తేదీకి వివేకా మర్డర్ జరిగి ఏడాది అవుతుంది. ఇన్ని రోజులైనా ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించలేదు. హత్య చేసి, రక్తపు మరకలు తుడిచివేయడం జరిగినా అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేశారు. ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ వివేకా మర్డర్ కేసు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. హత్య చేయించింది టీడీపీ నేతలే అని వైసీపీ నేతలు ఆరోపిస్తే.. ఎన్నికల్లో సానుభూతి కోసం వైసీసీ నేతలే ఈ మర్డర్ చేయించారని టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు.

See Also | ఎమ్మెల్యేలకు జగన్ షాక్, స్థానిక ఎన్నికల్లో మీ బంధువుల‌కు బీ-ఫామ్ ఇవ్వం, కార్యకర్తలకే సీట్లు