కూతుర్ని వేధిస్తుంటే అడ్డుకుందని..నడిరోడ్డుపై వృద్ధురాలిపై దాడి..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రోడ్డుపై దారుణాలు జరిగినా..సాటి మనిషి ప్రాణాలు తీసేస్తున్నా…ఫోన్లతో ఫోటోలు, వీడియో తీస్తారే తప్ప వాటిని కనీసం అడ్డుకోవాలని కూడా అనుకోవటం లేదు చాలామంది. తీసి ఫోటోలను..వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంలో ఉన్న ఇంట్రెస్ట్ తోటి మనిషిని కాపాడ్డంలో మాత్రం ఏమాత్రం చూపించట్లేదని మరోసారి రుజువైంది.


ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లోని కవినగర్ లో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. తన కూతురుతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ఆమె తల్లి అడ్డుకుంది. ఆ తల్లికి 70 ఏళ్ళు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. దారి కాచి దారుణంగా దాడికి పాల్పడ్డాడు. అక్కడ కొంతమంది ఉన్నారు..చూశారు..కానీ ఏ ఒక్కరూ అతన్ని అడ్డుకోలేదు.


దీంతో మరింత రెచ్చిపోయిన అతను వృద్ధురాలిని రోడ్డుపై పడేసి ఇష్టమొచ్చినట్లుగా బాదాడు. తరువాత అక్కడే ఉన్న ఓ కుర్చీ తీసుకుని బలంగా కొట్టాడు. దెబ్బలు తాళలేక ఆ వృద్ధురాలు రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయింది. ఈ దాడి జరుగుతున్న సమయంలో అక్కడ చాలా మంది ఉన్నారు. కానీ..ఎవ్వరూ ఈ దారుణాన్ని ఆపేందుకు కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. శనివారం( సెప్టెంబర్ 12,2020)న జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతను సునీల్ చౌదరిగా గుర్తించారు.


అతను ఆడపిల్లల్ని..మహిళల్ని వేధించటమే పనిగా రోడ్లమీద తిరుగుతుంటాడని..చిన్నారుల నుంచి పెద్దవారి వరకూ వయస్సుతో తారతమ్యం లేకుండా ఆడవారిపై అసభ్యకరంగా వ్యాఖ్యానిస్తుంటాడని బాధితురాలి కొడుకు పోలీసులకు తెలిపాడు. అతన్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. సదరు నిందితుడిపై బాధితురాలి కొడుకు ఆరోపించిన ఆరోపణలు నిజమా? కాదా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


కాగా..బాధితురాలి హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

Related Posts