వారెంట్లు లేకుండానే ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, సోదా చేయొచ్చు.. యూపీలో కొత్త దళం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే వారెంట్ ఉండాలి. కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉండాలి. కానీ, ఇవేమీ లేకుండానే పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేసేయొచ్చు. అవును, ఈ మేరకు యూపీ ప్రభుత్వం కొత్త దళం తీసుకొచ్చింది. వారెంట్లు, కోర్టు నుంచి ఆదేశాలు, ఎఫ్ఐఆర్ వంటివేమీ లేకుండా నేరుగా ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారాన్ని పోలీసులకు కల్పించే నిర్ణయాన్ని యోగి ప్రభుత్వం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక భద్రత దళం(SSF-Special Security Force) ఒకటి యూపీ పోలీసు శాఖలో ఏర్పాటైంది.

ఎవరినైనా అరెస్ట్ చేయడానికి, వారి ఇళ్లలో/ ఆఫీసుల్లో సోదాలు నిర్వహించడానికి పోలీసు శాఖలోని ఇతర ఏడు విభాగాలకు లేని అధికారాలను ఈ విభాగానికి ఇచ్చారు. అరెస్ట్ చేయడానికి తగిన ఆధారం ఆ విభాగం దగ్గర ఉంటే చాలు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) మాదిరిగా వారెంట్ లేకుండానే తనిఖీ, అరెస్ట్ చేసే అధికారం దీనికి ఉంటుంది. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ ప్రత్యేక భద్రతా దళం (యూపీఎస్ఎస్ఎఫ్)ను ఏర్పాటు చేయనున్నట్లు యోగి ప్రభుత్వం తెలిపింది.

అంతేకాదు, రుసుం చెల్లించి ఎస్ఎస్ఎఫ్ సేవలను ప్రైవేట్ సంస్థలు, కంపెనీలు, వ్యక్తులు కూడా ఉపయోగించుకోవచ్చని యూపీ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి(హోమ్) అవనీశ్ కుమార్ అవస్తి తెలిపారు. ప్రైవేట్ వారి కోసం విధులు నిర్వహిస్తున్నప్పుడు ఈ విభాగానికి అవే అధికారాలు ఉంటాయి. ఇకపోతే ఈ విభాగంలో పని చేసే ఎవరిపైనా కేసు పెట్డడానికి వీలుండదు. కోర్టులు కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా వీరిపై నేరాలను పరిగణలోకి తీసుకునే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

మూడు నెలల్లో ఎస్ఎస్ఎఫ్ పని చేయడం ప్రారంభిస్తుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం యూపీ ప్రత్యేక పోలీసు విభాగం బిల్లుకు ఆమోదం తెలిపింది.

* ఎస్ఎస్ఎఫ్ కోసం 1913 కొత్త పోస్టులను మంజూరు చేస్తారు.
* మొత్తం 9వేల 919 మంది దీనిలో ఉంటారు.
* తొలుత 8 బెటాలియన్లతో యూపీఎస్ఎస్ఎఫ్ ఏర్పాటు.
* అదనపు డీజీ నేతృత్వంలో పని చేస్తుంది.
* తొలిదశలో రూ.1746 కోట్లు వ్యయం.
* గతంలో యూపీ కోర్టుల ప్రాంగణాల్లోనే కొన్ని నేరాలు జరగడంతో ఈ బలగాలను అలహాబాద్ హైకోర్టు, లక్నో ధర్మాసనం, జిల్లా కోర్టుల్లో వినియోగించనున్నారు.
* రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కార్యాలయాలు, ప్రార్థన మందిరాలు, మెట్రోలు, ఎయిర్ పోర్టులు, బ్యాంకులు, పరిశ్రమల్లోనూ ఎస్ఎస్ఎఫ్ బలగాలను వినియోగిస్తారు.

యూపీ పోలీసుల ప్రత్యేక విభాగమైన ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కాన్స్టాబులరీ (పీఏసీ) నుండి మౌలిక సదుపాయాలు ఏర్పాటవుతాయి. ఇది సీఎం యోగి ఆదిత్యనాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి అవస్థీ తెలిపారు.

యోగి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త దళం వివాదాస్పదంగా మారింది. ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. విపక్షాలు, అణగారిన వర్గాల అణిచివేతకే ప్రభుత్వం నూతన చట్టాన్ని చేసిందని పీసీసీ చీఫ్ అజయ్ లాలూ ఆరోపించారు. ఇది 1919 నాటి రౌలత్ చట్టాన్ని తలపిస్తోందన్నారు. దీన్ని కోర్టులో సవాల్ చేస్తామన్నారు. ప్రైవేట్ వారికీ పోలీసు సేవలు అందించాలన్న నిర్ణయం విడ్డూరంగా, ప్రమాదకరంగా ఉందని యూపీ మాజీ డీజీపీ అర్వింద్ కుమార్ జైన్ అన్నారు. ప్రజాస్వామ్య ప్రయోజనాలను కాపాడే రీతిలో ప్రభుత్వ నిర్ణయం లేదని సమాజ్ వాదీ పార్టీ నేతలు అన్నారు. సీఐఎస్ఎఫ్ సెక్షన్‌లోని 12 మాదిరి అధికారాలతో కొత్తగా ఏర్పాటు చేసే భద్రతా దళానికి వారెంట్ లేకుండా తనిఖీ, అరెస్ట్ చేసే అధికారం ఇవ్వడం వల్ల అది దుర్వినియోగమయ్యే అవకాశముందని విమర్శలు వస్తున్నాయి.

Related Posts