అమెరికా అధ్యక్ష ఎన్నికలు : కమలా హ్యారిస్ ఎవరు ? ఆమె భారతీయ మూలాలకు ఎందుకంత ప్రాధాన్యత?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అమెరికా అధ్యక్ష ఎన్నికలు కీలక దశకు చేరుకున్న వేళ…డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా తమ పార్టీకి చెందిన భారత సంతతి మహిళ కమలా హ్యారిస్‌ను ప్రకటించారు. తాను అమెరికా అధ్యక్షుడిగా వైట్ హౌస్‌లో అడుగు పెడితే.. నెంబర్ 2 స్థానంలో మహిళే ఉంటారని గతంలోనే చెప్పిన జో బైడెన్… కమలా హ్యారిస్ పేరు ప్రకటించారు.

కమలా హ్యారిస్.. పేరులోనే భారతీయత ఉంది. కమలా హ్యారిస్ మూలాలు మన దేశంలోనే ఉన్నాయి. ఆమె పూర్తి పేరు…కమలా దేవి హ్యారిస్. తల్లి పేరు శ్యామలా హ్యారిస్. చెన్నైలో పుట్టిపెరిగి… క్యాన్సర్ పరిశోధకురాలిగా అమెరికాలో స్థిరపడ్డారు. జమైకా దేశానికి చెంది… ఆఫ్రికన్ మూలాలు ఉన్న డొనాల్డ్ హ్యారిస్‌ను శ్యామల పెళ్లి చేరుకున్నారు. వాళ్ల కుమార్తే కమలా హ్యారిస్. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడంతో కమలా హ్యారిస్ తల్లి దగ్గరే పెరిగారు.

తల్లి ఇండియన్.. తండ్రి ఆఫ్రికన్ కావడంతో.. రెండు దేశాల సంప్రదాయాలు కమలా హ్యారిస్‌లో కనిపిస్తాయి. కాలిఫోర్నియాలో ఇండో ఆఫ్రికన్ అమెరికన్‌గా పుట్టిన కమలా హ్యారిస్.. డెమొక్రటిక్ పార్టీలో కీలక స్థాయికి ఎదిగారు. తల్లి శ్యామలా గోపాలన్‌తో కలిసి అనేకసార్లు చెన్నై వచ్చారు. తన పేరులోనే కమలం ఉందని… భారతీయ సంప్రదాయాల్లో దానికి ఎంతో విలువ ఉందంటూ ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు కమలా హ్యారిస్.

నవంబర్ 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ గెలుపొందితే… తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ కూడా చరిత్ర సృష్టిస్తారు. దీంతోపాటు తొలి ఇండో, ఆఫ్రికన్ అమెరికన్ మహిళగా ఆ పదవి చేపట్టి చరిత్రలో నిలిచిపోతారు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన కమలా హ్యారిస్… 2017 నుంచి కాలిఫోర్నియా సెనెటర్‌గా పనిచేస్తున్నారు. అంతకు ముందు కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా కూడా పని చేశారు.

వాస్తవానికి ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో డొమొక్రటిక్ పార్టీ నుంచి నామినేషన్ పొందేందుకు కమలా హ్యారిస్ తీవ్రంగానే ప్రయత్నించారు. అయితే పార్టీ అంతర్గత డిబేట్స్‌లో జో బైడెన్ కంటే వెనుకపడ్డారు. డెమొక్రటిక్ పార్టీలో తనతో పోటీపడిన… కమలా హ్యారిస్‌కే ఉపాధ్యక్ష పదవి కట్టపెట్టాలని నిర్ణయించుకున్నారు జో బైడెన్.

కమలా హ్యారిస్‌ను.. జో బైడెన్… వైస్ ప్రెసిడెంట్ కాండిడేట్‌గా ప్రకటించడం వెనుక అనేక రాజకీయ వ్యూహాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వలసదారుల ఓట్లు చాలా కీలకం. ట్రంప్ ఒరిజినల్ అమెరికన్స్ ను నమ్ముకుంటే.. డెమొక్రటిక్ పార్టీ మొదటి నుంచి మైగ్రెంట్స్ ఓటు బ్యాంక్ పైనే ఆధారపడింది.

READ  ఆజంఖాన్ గెలిస్తే.. మహిళకు రక్షణ ఉండదు : జయప్రద

కమలా హ్యారిస్‌ను వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా ప్రకటించడం ద్వారా జో బైడెన్ రెండు రకాల ప్రయోజనాల్ని ఆశిస్తున్నారు. భారతీయ మూలాలు ఉండటంతో… ఇండియన్ అమెరికన్స్ మద్దతు మరింత ఎక్కువగా లభించే అవకాశాలుంటాయి. మరోవైపు ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్లో ఆఫ్రికన్ అమెరికన్స్ ఓట్లు చాలా కీలకంగా మారాయి. తెల్ల జాతి పోలీసుల చేతిలో జార్జ్ ఫ్లాయిడ్ హత్య జరిగిన తర్వాత… ఆఫ్రికన్ అమెరికన్లు మొత్తం ట్రంప్‌పై వ్యతిరేకతతో ఉన్నారు.

బ్లాక్ లైవ్స్ మేటర్ అంటూ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఇలాంటి సమయంలో ఆఫ్రికన్ అమెరికన్ల ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి జో బైడెన్… కమలా హ్యారిస్‌ను ప్రయోగించారు. పైగా కాలిఫోర్నియాను డెమొక్రటిక్ పార్టీకి కంచుకోటగా చెబుతారు. పార్టీ డోనర్స్ కూడా కాలిఫోర్నియాలోనే ఎక్కువగా ఉన్నారు. అందుకే అదే ప్రాంతానికి చెందిన కమలా హ్యారిస్ వైపే మొగ్గు చూపారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో గతంలో రెండుసార్లు ఇద్దరు మహిళలు ఉపాధ్యక్ష పదవికి నామినేట్ అయినా… వైట్ హౌస్‌లో మాత్రం అడుగు పెట్టలేకపోయారు. ఒబామా హయాంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన జో బైడెన్… ఇప్పుడా స్థానానికి కమలా హ్యారిస్‌ను ఎంచుకున్నారు. జో బైడెన్ గెలిస్తే మాత్రం కమలా హ్యారిస్ రూపంలో అమెరికా చరిత్రలో కొత్త అధ్యాయం మొదలవుతుంది.

Related Posts