భారత్ కు అండగా అమెరికా ఉంది…చైనాను కలిసి ఎదుర్కొంటాం : మైక్ పాంపియో

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

US stands with India, says Mike Pompeo భారత్‌, అమెరికా రక్షణ సంబంధాల్లో సరికొత్త అంకానికి తెరలేచింది. ఇవాళ(అక్టోబర్-27,2020) ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భారత్- అమెరికా రక్షణ, విదేశాంగశాఖల మంత్రుల మధ్య జరిగిన టూ ప్లస్ టూ సమావేశంలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కీలకమైన బెకా(Basic Exchange and Cooperation Agreement)ఒప్పందం కుదిరింది. హైదరాబాద్ హౌస్‌లో జరిగిన సమావేశంలో అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ టీ ఎస్పర్‌లతో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ , విదేశాంగ మంత్రి జైశంకర్ సమావేశమయ్యారు.అమెరికాకి చెందిన ఉపగ్రహాలు, సెన్సార్లు ప్రపంచవ్యాప్తంగా సేకరించే కీలకమైన భౌగోళిక, అంతరిక్ష సమాచారాన్ని భారత్‌తో పంచుకొనేలా బేసిక్ ఎక్స్ ఛేంజ్ అండ్ కోపరేషన్ అగ్రిమెంట్-బెకా’ ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. భారత్​ తరఫున రక్షణ శాఖ అదనపు కార్యదర్శి జివేశ్​ నందన్​ సంతకం చేశారు. బెకా ఒప్పందం ద్వారా చైనా ఆక్రమణలను భారత్ సైనికులు గుర్తించి ఆయా ప్రదేశాలను రక్షించుకునేందుకు వీలుంటుంది.2+2 భారత్-అమెరికా మంత్రిత్వస్థాయి సమావేశం తర్వాత సంయుక్త ప్రకటన విడుదల సమయంలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి పాంపియో మాట్లాడుతూ…ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొవడం చాలా ముఖ్యమని, దీనికి భారత్‌, అమెరికా మధ్య సంబంధాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. రెండు ప్రజాస్వామ్య దేశాలు కలిసి అభివృద్ధి చెందే అవకాశం ఈ ఒప్పందం ద్వారా లభించిందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి పాంపియో తెలిపారు.

ఈ ఏడాది జులైలో గల్వాన్ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్లను ఈ సందర్భంగా మైక్ పాంపియో గుర్తుచేసుకున్నారు. ఢిల్లీలో సైనికుల గౌరవార్థం నిర్మించిన నేషనల్ వార్ మొమోరియల్ ను తాము సందర్శించామని…భారత్ కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించినట్లు తెలిపారు. సార్వభౌమత్వం,స్వతంత్ర విషయంలో పొరుగుదేశాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్ కు తాము అండగా ఉంటామని మైక్ పాంపియో తెలిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ శక్తిగా భారత్‌ ఎదుగుతుండటాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు.చైనాపై ఈ సందర్భంగా మైక్ పాంపియో విమర్శలు గుప్పించారు. పారదర్శకతను,చట్టాన్ని చైనా పాటించడం లేదని పాంపియో విమర్శించారు. ప్రజాస్వామ్యానికి,చట్టానికి,పారదర్శకతకు చైనా ఫ్రెండ్ కాదని మన నాయకులు,ప్రజలకు బాగా క్లారిటీ వచ్చిందని పాంపియో అన్నారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎదురయ్యే బెదిరింపులకు మాత్రమే కాకుండా, అన్ని రకాల బెదిరింపులకు వ్యతిరేకంగా సహకారాన్ని బలోపేతం చేయడానికి అమెరికా- భారతదేశం చర్యలు తీసుకుంటున్నాయన్నారు. గత సంవత్సరం, సైబర్ సమస్యలపై తమ సహకారాన్ని అందించామని… అమెరికా-భారత్ నావికాదళాలు హిందూ మహాసముద్రంలో సంయుక్త ఎక్స్ ర్ సైజ్ నిర్వహించిన విషయాన్ని మైక్ పాంపియో గుర్తు చేశారు. చైనా దుందుడుకుతనానికి చెక్‌పెట్టేందుకు అమెరికా-భారత్‌ కలిసి పని చేస్తాయని పాంపియో చెప్పారు.కాగా, గడిచిన 2 దశాబ్దాలుగా భారత్‌, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయని ఈ సందర్భంగా విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ అన్నారు. మరోవైపు, బెకా ఒప్పందాన్ని పూర్తి చేసినందుకు చాలా ఆనందంగా ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. సమాచార మార్పిడికి ఇది సరికొత్త మార్గాలను తెరిచిందని వ్యాఖ్యానించారు. ఇతర సమస్యలపైనా అమెరికాతో చర్చించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందన్నారు. గతంతో పోల్చుకుంటే గత ఏడాది కాలంలో రక్షణ, భద్రత రంగాల్లో ఇరు దేశాలూ మరింత బలపడ్డాయని అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్‌ ఎస్పర్‌ అన్నారు. ఇండో పసిఫిక్‌ రీజియన్‌లోని భద్రతాపరమైన సమస్యల పరిష్కారానికి ఈ ఒప్పందం మరింత దోహదపడుతుందన్నారు.

Related Tags :

Related Posts :