ప్రజలకు దూరంగా ఉత్తమ్ భార్య పద్మావతి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నలమాద పద్మావతి.. రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితమైన పేరు. టీపీసీసీ చీఫ్‌, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డికి సతీమణి. కోదాడ మాజీ ఎమ్మెల్యే. రెండు తెలుగు రాష్ట్రాల దృష్టిని ఆకర్షించిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ నేత. ఉత్తమ్‌కు రాజకీయంగా అన్ని విధాలా వెన్నంటి నడిచిన మహిళానేత పద్మావతి. కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలు తమకు రెండు కళ్ల లాంటివని, ఈ నియోజకవర్గ కార్యకర్తలే తమ పిల్లలని నిత్యం చెబుతుంటారు.కానీ పద్మావతి అప్పుడప్పుడు ఏదో చుట్టపు చూపుగా వచ్చి పోతున్నారట. ఇటీవల కాలంలో అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని టాక్. అసలు దీనికి కారణం ఏమై ఉంటుందా అని కోదాడ, హుజూర్‌నగర్‌ జనాలు తలబద్దలు కొట్టుకుంటున్నారు. పద్మావతి 2014లో కోదాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు పద్మావతి. ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కనే హుజూర్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. అధికారం కోల్పోయాక… ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాష్ట్రమంతా తిరుగుతుంటే.. పద్మావతి ఎమ్మెల్యేగా అటు కోదాడ, ఇటు‌ హుజూర్‌నగర్ లో పర్యటించి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి నిధులను పర్యవేక్షించేవారు. 2018 ఎన్నికలలో మాత్రం కోదాడ నియోజకవర్గ ఓటర్లు పద్మావతిని తిరస్కరించారు. హుజూర్ నగర్‌లో మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డికి విజయం అందించారు.కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్ చేతిలో స్వల్ప ఓట్లతో ఓడిన పద్మావతి.. ఆ ఓటమిని జీర్ణించుకోలేక పోయారని టాక్. చాలా సున్నిత మనస్తత్వం కలిగిన పద్మావతి ఆ ఓటమి తర్వాత అక్కడే కన్నీటి పర్యంతమయ్యారని అంటుంటారు. కోదాడలో ఎమ్మెల్యేగా ఓటమి పాలయ్యాక కొన్ని రోజుల పాటు.. అటు కోదాడ.. ఇటు హుజూర్ నగర్‌లకు రాలేదు. 2018లో రెండోసారి తెలంగాణ రాష్ట్రంలో ఓడిన కాంగ్రెస్.. అధిక ఎంపీ సీట్లను గెలవాలని.. అందుకు కీలక నేతలంతా బరిలోకి దిగాలని అధిష్టానం ఆదేశించడంతో.. హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్ అనివార్యంగా నల్గొండ ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది.

ఎంపీగా గెలవడంతో హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. ఇది ఉత్తమ్ కంచుకోట. ఉప ఎన్నికలలో కూడా గెలవాల్సిన స్థానం. దీంతో హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ఉత్తమ్ తన భార్య పద్మావతిని కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్టానం ఆశీస్సులతో రంగంలోకి దించారు.కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీగా ఖర్చుపెట్టి తలపడ్డాయి. కానీ టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి అనూహ్యంగా గెలిచారు. అప్పటి వరకు హుజూర్‌నగర్ కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడంతో ఉత్తమ్, పద్మావతిలకు వ్యక్తిగతంగా ఇబ్బందిగా మారింది. ఉత్తమ్, పద్మావతి దంపతులకు రెండు కళ్ల లాంటి కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలు చేజారడం రాజకీయంగా దెబ్బ తీసినట్టయ్యింది.
ఆరు నెలల కాలంలోనే అటు కోదాడలో, ఇటు హుజూర్ నగర్‌లో ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో డీలాపడిన పద్మావతి.. ఇప్పుడు ఆ రెండు నియోజకవర్గాలకు వెళ్లడం లేదని కార్యకర్తలు అనుకుంటున్నారు. తమ కంచుకోటలుగా చెప్పుకొని.. ఉత్తమ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన నియోజకవర్గాలు రెండింటినీ చేజార్చుకోవడంతో బాగా ఫీలవుతున్నారట. అందుకే ఆమె రావడం లేదంటున్నారు.

READ  పూర్వ వైభవం : తెరుచుకున్న పేపరు మిల్లు 

ఉపఎన్నికల ఫలితాల అనంతరం కార్యకర్తలకు విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియోలో.. తన రాత బాగాలేదని.. అందుకే రెండు చోట్ల ఓడిపోయాయని.. కార్యకర్తలు తనను క్షమించాలని కోరుతూ పద్మావతి చాలా ఆవేదనతో మాట్లాడారు. ఆ సమయంలో చాలా భావోద్వేగానికి లోనయ్యారు. మొత్తమ్మీద రాష్ట్ర స్థాయిలో హవా నడిపించి.. వరుస అపజయాలను మూటకట్టుకోవడం.. పద్మావతిని తీవ్రంగా కలిచివేసిందని అంటుంటారు ఉత్తమ్ అనుచరులు.
ఆ రెండు నియోజకవర్గాల వైపు అసలు రావడమే మానేశారని టాక్. ఉత్తమ్ మాత్రం ఎంపీ హోదాలో అభివృద్ధి కార్యక్రమాల పేరుతో మంత్రుల కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు.

Related Posts