వీడో రకం.. పగలు మాత్రమే దొంగతనాలు చేస్తాడు, బంగారం మాత్రమే కాజేస్తాడు.. గుంటూరులో పగటి దొంగ దొరికాడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

variety thief: సహజంగా దొంగతనం ఎప్పుడు చేస్తారు అంటే…దొంగతనం అలవాటు లేని వాళ్లు కూడా టక్కున చెప్పే సమాధానం రాత్రిపూట అని. ఆ సమయంలో అందరూ పడుకుంటారు కాబట్టి.. పని ఈజీగా పూర్తవుతుంది. కానీ ఈ దొంగ మాత్రం కాస్త వెరైటీ. కేవలం పగటిపూట మాత్రమే చోరీలు చేస్తాడు. అంతేకాదు కేవలం బంగారం మాత్రమే కాజేస్తాడు.

పగటి పూట చోరీ..బంగారం మాత్రమే అపహరణ:
దొంగతనాల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్‌.. శివారు ప్రాంతాలే టార్గెట్‌గా కొందరు.. తాళం వేసిన ఇల్లు కన్పిస్తే చాలు..చోరీ చేసే వాళ్లు మరికొందరు.. దాదాపుగా పగటి పూట రెక్కీ నిర్వహించి..రాత్రి వేళ పని కానిచ్చేస్తుంటారు.. బంగారం, వెండి, డబ్బు..ఇలా ఏది దొరికితే దాన్ని దోచేస్తారు.. ఈ దొంగ మాత్రం కాస్త డిఫరెంట్‌. ఇతగాడు కేవలం పగటి పూట మాత్రమే చోరీలు చేస్తుంటాడు. బంగారాన్ని మాత్రమే కాజేస్తాడు. గత కొద్ది రోజులుగా పోలీసుల కంటపడకుండా తప్పించుకు తిరుగుతున్న ఈ పగటి దొంగ ఆట కట్టించారు గుంటూరు అర్బన్ పోలీసులు.

వృత్తి సెల్ ఫోన్ షాపులో పని, ప్రవృత్తి దొంగతనాలు, రాత్రి కాగానే రిచ్ మ్యాన్ అయిపోతాడు:
పేరు రాంబాబు. వృత్తి సెల్‌ఫోన్‌ షాపులో పని చేయడం. ప్రవృత్తి పగటి పూట చోరీలకు పాల్పడటం. చోరీలంటే చిన్నా చితకా కాదు..మనోడి కళ్లకి బంగారం మాత్రమే కనిపిస్తుంది. కేవలం బంగారాన్నే దోచుకెళ్తాడు. మళ్లీ ఏం తెలియనట్లు ఇంటికి తాళం వేసేసి తాపీగా సెల్‌ఫోన్‌ షాపుకెళ్లి పనిచేసుకుంటాడు. ఇక చీకటి పడితే చాలు మనోడి హడావుడి మామూలుగా ఉండదు. సెల్‌ఫోన్‌ షాపులో పనిచేసే వాడు కాస్తా…రిచ్‌ మ్యాన్‌లా మారిపోతాడు. లక్షల్లో క్రికెట్ బెట్టింగ్‌లు చేస్తూ చెలరేగిపోతాడు. పగటి పూట దొంగలించిన బంగారాన్ని తాకట్టు పెట్టి రాత్రి పూట ఎంజాయ్ చేస్తాడు.

ఇప్పటివరకు ఆరు ఇళ్లలో పెద్ద ఎత్తున చోరీలు:
ఇతగాడు ఇప్పటివరకు ఆరు ఇళ్లలో చోరీ చేసి పెద్ద ఎత్తున బంగారు దోచుకున్నాడు. తాజాగా నంబూరులో ఓ ఇంట్లో చోరీకి పాల్పడుతుంటే పక్కా ప్లాన్ ప్రకారం పోలీసులు పట్టుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి…జైలుకు పంపించారు.

ఊరు వెళ్లాల్సి వస్తే సమాచారం ఇవ్వాలని పోలీసుల సూచన:
గుంటూరు అర్బన్‌లో పగటి దొంగతనాలు ఎక్కువ్వడంతో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా ఊరు వెళ్లాల్సి వస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే..మీ జాగ్రత్తల్లో మీరు కూడా ఉంటే మంచింది.

Related Posts