ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇకలేరు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Veteran singer SP Balasubrahmanyam dies, aged 74: దిగ్గ‌జ గాయ‌కుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం అనారోగ్యంతో కన్ను మూశారు. తన గాత్రంతో అలరించిన బాలు ఇక లేరు. దశాబ్ధాల పాటు దేశం మొత్తాన్ని తన పాటలతో ఉర్రూతలూగించిన బాలు.. ఆగస్టు మొదటి వారంలో COVID-19 పాజిటివ్ రావడంతో 5వ తేదీ నుంచి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనావైరస్‌తో సుదీర్ఘ పోరాటం తరువాత ఆయన ఈ రోజు కన్నుమూశారు.

ఆసుపత్రిలో రెండవ వారంలో అతని ఆరోగ్యం క్షీణించినప్పటికీ, అతను క్రమంగా పురోగతి సాధిస్తూ వచ్చాడు. అతని కుమారుడు ఎస్పీ చరణ్ కూడా బాలు ఆరోగ్య స్థితిని గురించి అంతా బాగానే ఉందని వివరించాడు. అయితే సడెన్‌గా ఆయనకు సీరియస్ కావడంతో చనిపోయారు. 1966 లో తెలుగు చిత్రం శ్రీశ్రీ శ్రీ మర్యాద రామన్నతో పాడటం ప్రారంభించిన ఎస్.పి.బి, దేశం ఇప్పటివరకు చూసిన అత్యంత గొప్ప గాయకుల్లో ఒకరుగా ఉన్నారు.ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4న జన్మించారు. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఆయన పూర్తి పేరు. సంగీత దర్శకుడు, నటుడుగా కూడా పనిచేశారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడారు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో ఆయన జన్మించారు.

తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడుతూ ఉండేవారు. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవాడు.1969 లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన ఈయన తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించాడు. తర్వాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించారు. ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) మొదలైనవి ఆయన నటించిన కొన్ని సినిమాలు. బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేకమంది కళాకారులకు గాత్రదానం చేశాడు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్ళకి గాత్రదానం చేసాడు.సినిమాల్లోనే కాక టి.వి రంగంలో ఆయన పాడుతా తీయగా, పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయనీ గాయకులను పరిచయం చేశాడు. ఇవి కాకుండా స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో తన గానాన్ని వినిపించాడు. బాలుకు భారతదేశ కేంద్రప్రభుత్వం నుంచి 2001 లో పద్మశ్రీ పురస్కారం లభించగా.. 2011 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు. 2012లో ఆయన నటించిన మిథునం సినిమాకు గాను నంది ప్రత్యేక బహుమతి లభించింది.

READ  కరోనాతో పోరాడే వైద్యుల కోసం.. స్పెషల్ ‘బయో సూట్’ రెడీ చేస్తోంది DRDO

Related Posts