వీడియో గేమ్స్ ఆడడం మంచిదేనట: పిల్లల అక్షరాస్యత, కమ్యూనికేషన్, మానసిక ప్రశాంతతను పెంచుతాయి- సర్వే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా సమయంలో ఎక్కువగా పిల్లలు వీడియో గేమ్‌లకు బానిసలుగా మారిపోయారు. స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌లో గేమింగ్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారు. గేమ్స్‌ ఆడటం అనేది ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా సాధారణం అయ్యింది. ఇదొక మాయా ప్రపంచంగా మారిపోయింది. పిల్లల మనస్సులపై వీడియో గేమ్స్ ప్రభావం గురించి తల్లిదండ్రులు చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇప్పుడు వచ్చిన ఒక కొత్త సర్వే వీడియో గేమ్స్ ఆడుకోవడం వారి అక్షరాస్యత, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు మొత్తం మానసిక ప్రశాంతతను మెరుగుపరుస్తుందని చెబుతుంది. నేషనల్ లిటరసీ ట్రస్ట్ వీడియో గేమ్స్ సర్వే కోసం యుకె అంతటా 11 మరియు 16 సంవత్సరాల మధ్య 4,626 మందిని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలు అన్నీ నవంబర్ మరియు డిసెంబర్ 2019 మధ్య కాలంలో జరిగాయి.

వీడియో గేమ్స్ ఆడే పిల్లలలో మూడవ వంతు (35.3%) మంది వీడియో గేమ్స్ తమను మంచి రీడర్లు(చదువుకునేవాళ్లు)గా చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. వీడియో గేమ్స్ ఆడేవారిలో ఎక్కువ మంది మొత్తంలో 79.4%మంది నెలకు ఒకసారి గేమింగ్‌కు సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ చదివినట్లుగా చెప్పారు. గేమ్ కమ్యూనికేషన్స్, రివ్యూస్ చదవడం వల్ల కమ్యునికేషన్ పెరిగినట్లుగా చెప్పుకొచ్చారు.

అలా చదవడం వల్ల ఆటగాళ్లకు వారి రచనలను మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. వీడియో గేమ్స్ ఆడేవారిలో 62.5% యువకులు కూడా నెలకు ఒకసారి గేమింగ్‌కు సంబంధించిన విషయాలను రాసినట్లు సర్వేలో చెప్పారు. ఇందులో చాలా మంది బ్లాగులు కూడా రాస్తారు. ఇక మల్టీ ప్లేయర్.. అండ్ షేరింగ్ గేమ్‌లు ఆడేవారు అయితే స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సానుకూల సంభాషణకు తోడ్పడుతుందని పరిశోధకులు తెలిపారు.

నలుగురిలో ముగ్గురు యువకులు అంటే దాదాపు 76.3% మంది వీడియో గేమ్స్ గురించి తమ స్నేహితులతో మాట్లాడుతారని సర్వేలో తేలింది, పుస్తకాల గురించి చర్చించే పదిలో ముగ్గురు (29.4%) తో పోలిస్తే వీడియో గేమ్స్ ఆడటం ‘నిజ జీవితంలో’ మరియు ఆన్‌లైన్‌లో సామాజిక సంబంధాలను పెంచుకోవడానికి సహాయపడుతుందని యువకులు చెప్పారు అని పరిశోధకులు తెలిపారు. బలమైన కమ్యూనికేషన్ మరియు సామాజిక సంబంధాలు మెరుగైన మానసిక ప్రశాంతతకు గేమింగ్ కారణం అవుతుందని పరిశోధకులు తేల్చారు.

అంతేకాదు చాలా మంది యువకులకు వీడియో గేమ్స్ ఆడటం వల్ల ఒత్తిడి మరియు కష్టమైన సమయాలలో తెలివిగా వ్యవహరించడానికి సహాయపడుతుంది అని పరిశోధకులు చెప్పారు. కరోనావైరస్ లాక్‌డౌన్‌ల సమయంలో ఇది ప్రత్యేకంగా సహాయపడుతుందని అంటున్నారు.

వీడియో గేమ్‌ల రకాలు లేదా పిల్లలు వాటిని ఎంతసేపు ఆడారు అనే దానిపై పరిశోధకులు ఇంకా వివరాలు ఇవ్వలేదు. సామాజికంగా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యే వ్యక్తులు, ఎప్పుడూ మూస ధోరణిలో ఉండే పిల్లలు వీడియో గేమ్స్ ఆడడం వల్ల సామాజికంగా కనెక్ట్ అవ్వగలరని పరిశోధనా మనస్తత్వవేత్త రాచెల్ కోవెర్ట్ చెప్పారు.

READ  యాక్సిడెంట్లు అవడానికి కారులో ఈ 5 మెయిన్ పార్ట్‌లే కారణం. చెక్ చేసుకున్నారా?

అధిక ఆందోళన మరియు సామాజికంగా కలిసే పరిస్థితులు తక్కువగా ఉన్న ఈ సమయంలో(కరోనా టైమ్) స్నేహితులతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండడానికి ఈ వీడియో గేమ్స్ మాకు ఉపయోగపడుతున్నట్లు చాలా మంది చెప్పుకొచ్చారు.

అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు ఫ్రీ గా ఉన్న సమయంలో ఏదో కాసేపు గేమింగ్ ఆడుకోవడం మంచిదే అయినా చేతిలో గేమింగ్‌ కంట్రోలర్‌ పట్టుకొని రాత్రంతా ఆడే వారు.. అదే ప్రపంచం అన్నట్లుగా ఆడేవారు మాత్రం ప్రమాదంలో పడినట్లే అంటున్నారు పరిశోధకులు. రోజంతా వీడియో గేమ్స్ ఆడే పిల్లలకు దృష్టి లోపం, ఇతర వ్యాధి రుగ్మతలు, ఒబిసిటీ వంటివి వచ్చే ప్రమాదం ఉంది. ఈ విషయంపైన కూడా అధ్యయనాలు ఉన్నాయి.

Related Posts