జలదిగ్బంధంలో గ్రామం…వృద్ధుడి మృతదేహాన్ని తరలించేందుకు ఎన్ని కష్టాలో?!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరీంనగర్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. నీటి ప్రవాహానికి కొన్ని చోట్ల కల్వర్టులు, రహదారులు కొట్టుకుపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా చెరువులు నిండటంతో సైదాపూర్ మండలం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది.

దీంతోపాటు గొల్లిగూడెం-ఆకునూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఓ వృద్ధుడి మృతదేహాన్ని ఆ మార్గం గుండా తరలించడానికి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మృతదేహాన్ని మంచానికి కట్టి పోలీసుల సహాయంతో అవతలి వైపునకు పంపించారు.

తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఉత్తరకోస్తా, ఒరిస్సా, దానికి ఆనుకుని ఉన్న గ్యాంగ్ టక్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపుకు వంపి తిరుగుతోంది. అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చలివాగులో చిక్కుకున్న 10 మంది రైతులను రెస్క్యూ హెలికాప్టర్లు సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగాయి.

Related Posts