అనంతపురంలో కిడ్నాపర్లుగా మారిన వాలంటీర్లు, బాలికల అపహరణ కేసులో ఐదుగురు అరెస్ట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అనంతపురం జిల్లాలో బాలికల కిడ్నాప్ కలకలం రేపింది. షాప్ కి వెళ్తుండగా ఇద్దరు బాలికలను అడ్డగించిన ఐదుగురు వ్యక్తులు కారులో ఎత్తుకెళ్లారు. కిడ్నాపర్లు అదే గ్రామానికి చెందిన ముగ్గురు వాలంటీర్లు కావడం సంచలనం రేపింది. మరో ఇద్దరు వారి స్నేహితులు. పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు కిడ్నాపర్లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బాలికలను వారి చెర నుంచి విడిపించారు. వారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. శింగనమల మండలం లోలూరు గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మత్తు మందు ఇచ్చి బాలికల కిడ్నాప్:
పోలీసుల ముగ్గురు వాలంటీర్లు సహా ఐదుగురిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు(16 ఏళ్లు, 17 ఏళ్ల) పక్క గ్రామంలో టైలరింగ్ పని నేర్చుకుంటున్నారు. జూన్ 25న బయటకు వెళ్లిన వారిద్దరిని ముగ్గురు గ్రామ వాలంటీర్లు, వారి ఇద్దరు స్నేహితులు అడ్డగించారు. వారికి మత్తు మందు ఇచ్చి కారులో బలవంతంగా తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. గ్రామ వాలంటీర్లు శివరాం, చంద్రశేఖర్‌, మధుసూదన్‌తో పాటు వారి ఫ్రెండ్స్ చంద్రముత్యాలు, రామాంజనేయులు కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదే రోజు అనంతపురంలో నిందితులను అరెస్ట్ చేసి బాలికలను కాపాడారు. నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తరుచూ వివాదాల్లో గ్రామ వాలంటీర్లు:
గ్రామానికి చెందిన అమ్మాయిలను స్థానికంగా ఉన్న వాలంటీర్లు కిడ్నాప్ చేశారన్న వార్త ప్రజలను భయాందోళనకు గురిచేసింది. రాష్ట్రంలో గ్రామ వాలంటీర్లు తరుచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ప్రభుత్వ ప్రతినిధులుగా పనిచేస్తున్న వాలంటీర్లే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం, సేవలు.. ప్రజల ఇంటికే చేర్చాలనే గొప్ప ఉద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. కానీ కొందరు వాలంటీర్ల కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. కొందరు వాలంటీర్లు అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నారు. ఏదైనా పథకానికి అర్హత కావాలంటే లంచం డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. కొందరు చేతివాటం చూపిస్తున్నారు. అర్హులకు అందాల్సిన నగదు మొత్తాన్ని వారే కాజేస్తున్నారు. తాజాగా అనంతలో బాలికల కిడ్నాప్ వ్యవహారంలో ముగ్గురు వాలంటీర్ల ప్రమేయం ఉండటం సంచలనంగా మారింది.

Related Posts