“పంజరాల నుంచి రామ చిలుకలను విడిపించండి”: కొణిదెల ఉపాసన

  • Published By: veegamteam ,Published On : February 1, 2020 / 04:25 AM IST
“పంజరాల నుంచి రామ చిలుకలను విడిపించండి”: కొణిదెల ఉపాసన

పంజరాల నుంచి రామ చిలుకలను విడిపించండి..లేదా చిలుకలను బంధించినట్లుగా మీ దృష్టికి వస్తే ఫిర్యాదు చేయండి అంటూ కొణిదెల ఉపాసన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  రామచిలుకల సంరక్షణ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉపాసన పెట్టిన పోస్ట్‌ వైరల్‌ అయింది. రామచిలుకతో ఉపాసన దిగిన ఫొటోతో పాటు ఆ పోస్ట్‌లో ‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పక్షి రామచిలుక, రాష్ట్ర జంతువు క్రిష్ణ జింక అనే విషయం మీకు తెలుసా?. రామచిలుకలను బంధించడం నేరం. ఆరేళ్లవరకూ జైలు శిక్ష కూడా పడొచ్చు. రామచిలుకలు స్వేచ్ఛగా ఎగరాలి గానీ పంజరంలో బందీలు కాకూడదు. ప్రకృతిలో  చిలుకలు ఉన్నవి మన తలరాతను చెప్పడానికీ, జాతకాలు చెప్పటానికి…మనకు వినోదం పంచడానికి కాదు అవి ఉన్నది’ అని ఫాలోవర్లకు మెసేజ్ ఇచ్చారు.  ‘అటవీ జంతువుల సంరక్షణలో భాగంగా మీ వంతుగా పంజరాల నుంచి రామ చిలుకలను విడిపించండి, లేదా ఫిర్యాదు చేయండి’ అని నెటిజన్లను ఉపాసన కోరారు. సామాజిక మాధ్యమాల్లో ఉపాసన పోస్ట్‌కు మంచి స్పందన వస్తోంది.

‘చిట్టీ చిలుకమ్మ’ ఎక్కడ? తోటలో వెతికినా..కనిపించటంలేదు. పిల్లలు కూడా ‘‘చిట్టి చిలుకమ్మా అమ్మ కొట్టిందా.. తోటకెళ్లావా..పండే తెచ్చవా’ అనే పాట కూడా పాడుకోవటంలేదు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పాటలే పాడుకుంటున్నారు. అని చిన్నప్పుడు పాడుకున్న పాట బహుశా చాలామందికి గుర్తు ఉండకపోవచ్చు. చిలకపచ్చ అనేది చిట్టి చిలకమ్మల రంగునే మనం చెప్పుకుంటుంటాం. కానీ పచ్చని చెట్లే కనుమరుగువుతున్నాయి. వాటితో పాటు చిలకపచ్చ చిలుకమ్మలు కూడా కనుమరుగైపోతున్నాయి. 

‘ఆకుపచ్చ రంగులో, ఎర్రటి ముక్కుతో చక్కటి వినసొంపైన పలుకులతో పలుకరించే చిలకమ్మలు కనిపించకుండాపోతున్నాయి.  గుంపులు గుంపులుగా విహరించే రామ చిలుకలను చూసి చాలా రోజులైంది’ కాదు కాదు ఎంతో కాలమైంది. ఈ బిజీ బిజీ లైఫ్ లో రామచిలుకలు చూడాలనే ధ్యాసే లేకుండా పోతోంది కదూ. 
కానీ ఇప్పటికైనా మనం అందరం ‘బాధ్యతగా స్పందించకపోతే ఇక మీదట రామచిలుకలను చూడడం కూడా అరుదైపోతుంది’ అవి కేవలం ఫోటోల్లో చూడాల్సిందే. ఇంటర్ నెట్ లలో వెతుక్కోవాల్సిందేనంటున్నారు పర్యావరణ వేత్తలు. పర్యావరణంపైనా..వన్యప్రాణుల విషయంలో చక్కగా స్పందించే కొణిదెల ఉపాసన కూడా అదే విషయాన్ని తన  ఇన్ స్టా గ్రామ్ లో గుర్తు చేశారు.