పాపం..తెల్లకాకి తిప్పలు..ఇలా పుట్టడమే నా పాపమా?..

  • Edited By: nagamani , August 14, 2020 / 04:23 PM IST
పాపం..తెల్లకాకి తిప్పలు..ఇలా పుట్టడమే నా పాపమా?..

కాకుల్లో తెల్లకాకి వేరయా. వెయ్యి నల్లటి కాకుల్లో ఒక్కటంటే ఒక్క తెల్ల కాకి ఉంటే అందరూ దాని వైపే చూస్తారు. కాకి అంటే నలుపు అనే విషయం అందరికీ తెలిసిందే. మరి అటువంటిప్పుడు తెల్లకాకి కనిపిస్తే వింతకాక మరేంటి? మరి అటువంటి తెల్లకాకి కనిపిస్తే జనాలు ఎగబడి చూడరా ఏంటీ? వింత అంటే కాదు వింతలకే వింత అని దండోరా వేయటం కాకులంటే మనుషులకే ఎక్కువ అలవాటు..

అలా దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో ఇటీవల నల్ల కాకుల గుంపులో ఓ తెల్లటి కాకి కావు..కావు మని మొత్తుకుంటూ తెగ అల్లరి చేసిన వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ తెల్లకాకిని చూసివాళ్లంతా ఆహా..తెల్లకాకి ఉందంటే ఇప్పటి వరకూ నమ్మనేలేదు. నిజమేనన్నమాట అంటూ ఓ తెగ బుగ్గలు నొక్కేసుకున్నారు. అలా ఢిల్లీలో కనిపించిన ఆ తెల్లకాకిని వీడియో తీసి వైరల్ చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా ఒడిశాలోని జార్సుగూడ పట్టణంలో కూడా ఓ తెల్లకాకి కనిపించింది. ఢిల్లీ వాళ్లలా వాళ్లు ఆ తెల్లకాకిని ఫోటోలు తీసి…వీడియోలు తీసి వదిలేయలేదు. పాపం దానికి చుక్కలు చూపించారు. దాన్ని పట్టుకునేదాకా వదల్లేదు. పట్టుకుని బోనులో పెట్టారు. ఫలానా ఏరియాలో తెల్లకాకి ఉందని దాన్ని పట్టుకున్నారని చుట్టుపక్కల ప్రచారం కావడంతో జనం దాన్ని చూడ్డానికి ఎగబడ్డారు. దీంతో ఆ తెల్లకాకి బేజారెత్తిపోయింది. ఇదేంటీ ఈ జనాలు మరీ నన్ను ఇలా వింతగా చూస్తున్నారు..నన్ను కాల్చకుని తినేయరు కదానుకుందో ఏమోగానీ బోనులో కావు కావు మంటూ ఒకటే అరుపులు.

ఈ విషయం కాస్తా అటవీ శాఖ అధికారులకు తెలియటంతో అక్కడికి చేరుకుని ‘జైల్లో’ ఉన్న కాకిని చూసి ముక్కున వేలేసుకున్నారు. అసలు దాన్ని ఎందుకు పట్టుకున్నారంటూ స్థానికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తరువాత దాన్ని గాల్లోకి వదిలేశారు. కాకిని నిర్బంధించడంపై జంతుహక్కుల సంఘాలు మండిపడుతున్నారు. తెల్లగా పుట్టడమే నేరమా అని ప్రశ్నిస్తున్నాయి.