విశాఖ జిల్లాలో టీడీపీ కొత్త కమిటీలు, వైసీపీ దూకుడును అడ్డుకుంటాయా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

visakha tdp: విశాఖ జిల్లాలో టీడీపీకి పట్టు ఎక్కువ. ముఖ్యంగా రూరల్ జిల్లాలో ఆ పార్టీకి బలమైన కేడర్‌ ఉంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లు గెలవలేకపోయినా పార్టీ బలం మాత్రం తగ్గలేదనే చెప్పాలి. సిటీ పరిధిలో మాత్రం నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలిచింది. అంతా బాగానే ఉన్నా.. టీడీపీ పరాజయానికి బాధ్యత వహిస్తూ అప్పటి వరకూ రూరల్ అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేశ్‌ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన వైసీపీ పంచన చేరారు. ఎన్నికల సమయానికి టీడీపీ నగర అధ్యక్షుడిగా ఉన్న రెహ్మాన్ ఎన్నికల అనంతరం రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు.

టీడీపీకి వరుస షాకులు:
అనకాపల్లి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అడారి ఆనంద్ కుమార్ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పంచకర్ల రమేశ్‌ రాజీనామా అనంతరం మళ్లీ తెలుగుదేశం అధిష్టానం ఆ స్థానాన్ని భర్తీ చేయలేదు. రెహ్మాన్ స్థానంలో నగర అధ్యక్షుడిగా విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ను నియమించింది. కేవలం ఆ ఒక్క కమిటీ ఆధ్వర్యంలో ఇన్నాళ్లు కార్యక్రమాలు సాగాయి. టీడీపీ అధిష్టానానికి షాక్ ఇస్తూ నగర అధ్యక్షుడిగా ఉన్న వాసుపల్లి గణేశ్‌కుమార్ కూడా వైసీపీకి మద్దతు పలుకుతున్నారు. దీంతో నగర, జిల్లా పరిధిలో పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించే వారే కరువైన పరిస్థితి ఉంది.

అప్రమత్తమైన చంద్రబాబు, కేడర్ చేజారకుండా చర్యలు:
పరిస్థితులు చేజారిపోతుండడంతో అధిష్టానం మేల్కొంది. అప్రమత్తం అయ్యింది. జిల్లాలో కేడర్ చేజారిపోకుండా ఉండేందుకు జిల్లాలోని సీనియర్లకు కొత్త భాధ్యతలు ఇవ్వడంతో పాటుగా పార్టీ పార్లమెంటరీ కమిటీలకు అధ్యక్షుల నియామకం చేపట్టింది. విశాఖకు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లికి ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీశ్‌, అరకు స్థానానికి విజయనగరానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణిని బాధ్యులుగా నియమించారు చంద్రబాబు. కాకినాడ, అమలాపురం కో-ఆర్డినేటర్‌గా మాజీ మంత్రి బండారు సత్యనారాయణను, శ్రీకాకుళం, విజయనగరానికి పార్టీతో అంటీముట్టనట్లు ఉంటున్న విశాఖ పశ్చిమ ఎమ్మేల్యే గణబాబును నియమించారు. విశాఖ, అనకాపల్లి సమయన్వయకర్తగా చినరాజప్ప పర్యవేక్షణ చేస్తారు.

దూరమైన పార్టీ కార్యకర్తలను ఎలా ఆకట్టుకోవాలి?
కొత్త కమిటీలు వేశారు బాగానే ఉంది కానీ తెలుగుదేశానికి దూరమైన పార్టీ కార్యకర్తలను ఎలా ఆకట్టుకోవాలా అని ప్రస్తుత కమిటీలు తలలు పట్టుకుంటున్నాయని అంటున్నారు. రూరల్ విశాఖ జిల్లాలో విశాఖ డెయిరీ చైర్మన్ అడారి తులసిరావుకు ఆధ్వర్యంలోని రైతుల్లో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు ఎక్కువ. కానీ తులసిరావు కుమారుడు ఆనంద్ పార్టీ మారారు. యలమంచిలి మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్‌ అయిన అడారి తులసిరావు కుమార్తె ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్నారు. అనకాపల్లిలో వలస నేతలను నమ్ముకోవడంతో అక్కడ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే వారే కరవయ్యారని అంటున్నారు.

కొత్త కమిటీలు వైసీపీ దూకుడును అడ్డుకుంటాయా?
చాలామంది నేతలు స్తబ్దుగా ఉండిపోవడమో? వైసీపీ గూటికి చేరుతుండడంతో పార్టీని నిలబెట్టేందుకు కమిటీలు కసరత్తు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే సమయంలో వైసీపీ మాత్రం దూకుడు మీదుంది. అధికారం చేతుల్లో ఉండటంతో వాసుపల్లి గణేశ్‌కుమార్ లాంటి నేతలు కూడా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. మరి ఈ కొత్త కమిటీలు ఎంతవరకూ వైసీపీ దూకుడును అడ్డుకుంటాయో చూడాలని అంటున్నారు.

Related Tags :

Related Posts :