దీవెనల పేరుతో రూ.2లక్షలు దోచేశారు, విశాఖలో హిజ్రాల ఘరానా మోసం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

విశాఖలో హిజ్రాలు బరి తెగించారు. ఘరానా మోసానికి పాల్పడ్డారు. దీవెనల పేరుతో ఓ వ్యాపారిని నిలువు దోపిడీ చేశారు. అతడి దగ్గరున్న రూ.2లక్షలు దోచేశారు. రెప్పపాటులో డబ్బుతో ఉడాయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇద్దరి భరతం పెట్టారు.

వ్యాపారి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు ఉందని తెలిశాక డ్రామాలు:
ఈ షాకింగ్ ఘటన విశాఖలో చోటు చేసుకుంది. గాజువాకకు చెందిన బియ్యం వ్యాపారి మహేశ్వరరావు…సెప్టెంబర్ 11న అనకాపల్లి వెళ్లాడు. అక్కడి నుంచి రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆటోలో గాజువాక బయలుదేరాడు. మధ్యలో అగనంపూడి టోల్ గేటు దగ్గర ఆటో ఆగింది. అక్కడికి ఇద్దరు హిజ్రాలు వచ్చి డబ్బులు అడిగారు. వ్యాపారి 10 రూపాయలు ఇచ్చాడు. అది ఇస్తున్న సమయంలో వ్యాపారి దగ్గర రూ. 2లక్షలు ఉండటం హిజ్రాలు గమనించారు. అంతే, డ్రామా మొదలుపెట్టారు.

దీవిస్తామని ఆటో నుంచి కిందకు దించారు:
మీరు చల్లగా ఉండాలయ్య…మీ వ్యాపారం ఇంతకు పదింతలు కావాలి అంటూ…ఆటో దిగితే దీవిస్తామని కబుర్లు చెప్పారు. హిజ్రాల దీవెనలు మంచిదని భావించిన మహేశ్వరావు కిందికి దిగాడు. దీవిస్తున్నట్లు నటించిన హిజ్రాలు, వ్యాపారికి తెలియకుండానే తెలివిగా 2 లక్షలు తీసుకుని మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నారు.

అది గమనించని బాధితుడు ఆటోలో గాజువాక చేరుకున్నాడు. అక్కడికి వెళ్లాక డబ్బు లేకపోవడంతో కంగుతిన్నాడు. ఒక్కసారి రివైండ్ చేసుకున్నాడు. అతడికి హిజ్రాలు గుర్తుకు వచ్చారు. వెంటనే బాధితుడు దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సీసీ ఫుటేజీ ఆధారంగా హిజ్రాల పట్టివేత:
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే ఆ ఇద్దరి భరతం పట్టారు. డబ్బు కొట్టేసిన ఆ ఇద్దరి పేర్లు బత్తిలి స్పందన అలియాస్ వంశీ, యండవ తను. ఈ ఇద్దరు హిజ్రాలు ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర భిక్షాటన చేస్తుంటారు. సిగ్నళ్లు, జనాలు ఎక్కువగా లేని ప్రాంతాల దగ్గర మహిళల మాదిరిగా నిలబడి…పురుషులను ఆకర్షిస్తుంటారు.

ఆ తర్వాత వారి నుంచి డబ్బు కాజేస్తుంటారని పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఇద్దర్నీ గుర్తించిన పోలీసులు…అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.2 లక్షలు రికవరీ చేసి బాధితుడికి అప్పగించారు.

హిజ్రాలతో జాగ్రత్త:
ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. హిజ్రాల తీరు స్థానికులను భయాందోళనకు గురి చేసింది. దీని గురించి పోలీసులు పౌరులకు ప్రత్యేకంగా సూచనలు, హెచ్చరికలు చేశారు. రాత్రి సమయాల్లో లేదా ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని…లేదంటే నిలువు దోపిడీకి గురికాక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే అందరు హిజ్రాలు ఇలాగే ఉంటారని కాదన్నారు. ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం మంచిదని సూచించారు.

Related Posts