బావిలో 9 మృతదేహాల కేసులో వీడుతున్న మిస్టరీ, పోలీసులు అదుపులో ఆ ఇద్దరు

warangal well dead bodies case, two biharis in police custody

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలోని బార్‌దాన్‌ గోనె సంచుల గోడౌన్‌ ఆవరణలో ఉన్న బావిలో 9మంది వలస కార్మికుల మృతదేహాలు లభ్యమవడం సంచలనం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. వలస కార్మికుల మరణాలు మిస్టరీగా మారాయి. ఇవి హత్యలా? సామూహిక ఆత్మహత్యలా? అనేది అంతు చిక్కడం లేదు. గురువారం(మే 21,2020) 4 మృతదేహాలు వెలుగుచూడగా, శుక్రవారం(మే 22,2020) మరో 5 బయటపడ్డాయి. వీరిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన పశ్చిమ బెంగాల్‌ వాసులు కాగా, ఇద్దరు బీహార్‌, ఒకరు త్రిపురవాసిగా పోలీసులు గుర్తించారు. 

బతికుండగానే బావిలోకి నెట్టి చంపారా?
బావిలో మృతదేహాలపై ఇప్పుడిప్పుడే మిస్టరీ వీడుతోంది. ఫోరెన్సిక్‌ ప్రాథమిక నివేదికలో పలు వివరాలు బయటపడుతున్నాయి. వరంగల్‌ ఎంజీఎంలో శనివారం 9 మృతదేహాలకు శవపరీక్ష పూర్తి చేశారు. పోస్టుమార్టం రిపోర్టులో కీలక విషయాలు తెలిశాయి. నీట మునగడం వల్లే మరణాలు సంభవించినట్లు ప్రాథమిక నివేదికలో తేలింది. దీంతో బతికుండగానే బావిలోకి నెట్టి చంపారా? అనే అనుమానాలు తలెత్తున్నాయి. రెండు మృతదేహాల్లో మాత్రం ఊపిరితిత్తుల్లో నీళ్లు కనిపించ లేదని డాక్టర్లు తెలిపారు. మత్తులో ఉన్నప్పుడు ఈడ్చుకొచ్చి బావిలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాలను ఈడ్చుకు వచ్చినట్టుగా వారి శరీరంపై ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఆధారాల కోసం మరోసారి పోలీసులు బావిలోకి దిగి గాలించారు. అన్ని నివేదికలు క్రోడీకరించాకే తుది నిర్ణయానికి రానున్నారు పోలీసులు. మరో రెండు ఫోరెన్సిక్‌ నివేదికల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. 

కాల్ డేటా ఆధారంగా ఇద్దరు బీహారీలను విచారిస్తున్న పోలీసులు:
ఈ కేసులో కుటుంబ పెద్ద ఎండీ మక్సూద్‌ కాల్‌ డేటా కీలకంగా మారింది. ఆయన కాల్‌ డేటా ఆధారంగా ఇద్దరు బీహారీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంజయ్‌కుమార్‌ యాదవ్‌, మోహన్‌లను ఘటనాస్థలికి తరలించి పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనకు ముందు సాయంత్రం 6 గంటల సమయంలో బీహార్‌ యువకులతో మక్సూద్‌ మాట్లాడినట్లు తేలింది. బీహార్ యువకుల వాంగ్మూలం కేసులో కీలకంగా మారనుంది. 

20ఏళ్ల క్రితం బెంగాల్ నుంచి వరంగల్ కు వలస:
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎండీ మక్సూద్‌ కుటుంబం 20 ఏళ్ల క్రితం వరంగల్‌కు వలసొచ్చింది. బార్‌దాన్‌లోని గోనే సంచుల గోడౌన్‌లో మక్సూద్‌ కుటుంబం పని చేస్తోంది. బావిలో లభ్యమైన మృతదేహాలను మక్సూద్‌(50), ఆయన భార్య నిషా(45), కుమారులు షాబాద్‌(22), సోహైల్‌(20), కుమార్తె బుస్ర(20), బుస్ర కుమారుడు(3), బీహార్‌ చెందిన కార్మికులు శ్యామ్‌(22), శ్రీరామ్‌(20), వరంగల్‌ వాసి షకీల్‌గా పోలీసులు గుర్తించారు.

అక్రమ సంబంధమే కారణమా?
మక్సూద్ కూతురు బుస్రాకు వరంగల్‌లోని ఓ వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై బుస్రాకు ఆమె తల్లితో గొడవలు జరిగాయని.. దీంతో బుస్రాతో సన్నిహితంగా ఉంటున్న వ్యక్తి వచ్చి ఘర్షణకు దిగాడని తెలుస్తోంది. ఇవి ఆత్మహత్యలే అయితే.. వీరితోపాటు డ్రైవర్‌, బిహార్‌కు చెందిన శ్రీరామ్, శ్యామ్‌ కూడా బలవన్మరణానికి పాల్పడాల్సిన అవసరం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. వివాహేతర సంబంధం వల్లే వీరందర్నీ హత్య చేశారా? అనే అనుమానాలూ తలెత్తుతున్నాయి. వీరందరికీ ఆహారంలో విషం కలిపి ఇచ్చిన మక్సూద్.. స్పృహ కోల్పోయాక వారిని బావిలోకి తోసేసి ఉంటాడని.. తర్వాత అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.

కుటుంబ పెద్ద జేబులో కండోమ్ ప్యాకెట్:
మృతదేహాలను గుర్తించిన అనంతరం మక్సూద్ నివాసం ఉంటున్న గదులను తనిఖీ చేయగా.. అతడి జేబులో కండోమ్ ప్యాకెట్ కనిపించింది. పెళ్లై ముగ్గురు పిల్లలున్న వ్యక్తి దగ్గర కండోమ్ ఉండటం అనుమానాలకు తావిస్తోంది. దీనికి తోడు అందరి సెల్‌ ఫోన్లు సాయంత్రమే స్విచ్ఛాఫ్ కాగా.. మక్సూద్ ఫోన్ రాత్రి వరకు ఆన్‌లో ఉండటం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.

మరిన్ని తాజా వార్తలు