ఎవరి చేతుల్లోనూ తోలుబొమ్మలం కాదు…పాక్ ప్రశంసలపై ఘాటుగా స్పందించిన ఫరూక్ అబ్దుల్లా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తాము చేతుల్లోనూ తోలుబొమ్మలం కాదని పాక్ మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా. ఆర్టికల్ 370 ఆర్టికల్‌ రద్దయి ఏడాది గడుస్తోంది. ఈ సమయంలో 370 ఆర్టికల్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అక్కడి ప్రముఖ పార్టీల నేతలు జట్టు కట్టారు. కేంద్రం చర్యకు వ్యతిరేకంగా ఆరు రాజకీయ పార్టీలు ఐక్య మ్యానిఫెస్టోను(గుప్కర్ డిక్లరేషన్‌) ప్రకటించడాన్ని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషీ ప్రశంసించారు.

నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ సహా మరో మూడు పార్టీలు జారీ చేసిన మ్యానిఫెస్టో సాధారణ సంఘటన కాదని, ఒక ముఖ్యమైన పరిణామం అని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషీ ఇటీవల ఒక ప్రకటనలో కశ్మీర్ నేతలపై ప్రేమ ఒలకబోశారు. అయితే పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. జమ్ముకశ్మీర్ ప్రధాన స్రవంతిలోని రాజకీయ పార్టీలను పాకిస్తాన్ ఎప్పుడూ అవమానించేదని, అయితే ఇప్పుడు అకస్మాత్తుగా వారు మమ్మల్ని మెచ్చుకోవడం ప్రారంభించారని, దీనిలో అంతర్యమేమిటో అని ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. తమకు పాక్ దెప్పిపొడుపులుగానీ, మెచ్చుకోల్లుగానీ అవసరం లేదన్నారు.

మేం ఎవరి చేతుల్లోనూ తోలుబొమ్మలం కాదు. ఇటు న్యూఢిల్లీ లేదా అటు బోర్డర్‌‌కు వెలుపల ఉన్న ఇతరులకు.. ఎవరి కీలు బొమ్మలమూ కాదు. జమ్మూ కాశ్మీర్‌‌ ప్రజలకు మాత్రమే మేం జవాబుదారీ. వారి కోసమే మేం పని చేస్తున్నాం. కాశ్మీర్‌‌కు సాయుధులను పంపడాన్ని ఆపేయాల్సిందిగా పాకిస్తాన్‌ను నేను కోరుతున్నా. మా రాష్ట్రంలో రక్తపాతం ముగియాలని మేం భావిస్తున్నాం. జమ్మూ కాశ్మీర్‌‌లోని అన్ని పార్టీలు మా హక్కుల కోసం శాంతియుతంగా పోరాడాలని నిర్ణయించాం. గతేడాది ఆగస్టు 5న రాజ్యాంగానికి విరుద్ధంగా మా నుంచి దేన్నైతే తీసుకున్నారో దానిపై పోరాడుతాం అని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.

Related Posts