Heat Waves : అలర్ట్ : శుక్ర,శని వారాల్లో ఎండలు, తీవ్ర వడగాల్పులు

Heat Waves :  అలర్ట్ : శుక్ర,శని వారాల్లో ఎండలు, తీవ్ర వడగాల్పులు

Alert Heavy Heat Waves In Two Telugu States

Heavy heat waves in two Telugu states : గత రెండు రోజులుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2 నుంచి 4 డిగ్రీలమేర ఎక్కువగా నమోదవుతున్నాయి. ఒకవైపు ఎండలు మరో వైపు వడగాల్పులతో ప్రజలు అల్లాడి పోతున్నారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేసింది. గురువారం ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.

గురువారం అత్యధికంగా దెందులూరు (45.3), వేలేర్పాడు (45.0), పమిడి ముక్కల (45.0), బెల్లంకొండ (45.3), తెనాలి (45.5), చేబ్రోలు (45.0), కురిచేడు (45.8), కోనకనమిట్ల (45.8)లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ సమాచారం ప్రకారం గురువారం 113 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 217 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు ఏపీ విపత్తు నిర్వాహణ సంస్ధ తెలిపింది. ఏపీలో శుక్రవారం కూడా ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

శుక్రవారం ఏపీలోని 148 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 207 మండలాల్లో వడగాల్పులు ప్రభావం. ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. వడగాల్పులు ఎక్కువగా ఉండే జిల్లాల యంత్రాంగాలను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. ఎండలో  ఎక్కువ సమయం ఉండే వారు వడదెబ్బ బారినపడే అవకాశం ఉందని హెచ్చరించింది.

వడదెబ్బ తగలకుండా గొడుగు వాడటం, టోపీ పెట్టుకోవటం తో పాటు ఎక్కువ గా ద్రవపదార్ధాలు తీసుకోవటం వంటి రక్షణ చర్యలు చేపట్టాలని విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ కె. కన్నబాబు సూచించారు. పిల్లలు, వృధ్ధులు, మహిళలు వడ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవసరమైతేనే బయటకు రావాలని కన్నబాబు సూచించారు.

ఈరోజు రేపు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది.ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ సముద్రంలో తుపాను ప్రభావం కారణంగా వాతావరణంలో పలు మార్పులు జరుగుతున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని హెచ్చరించింది. వడగాల్పులు, మండుతోన్న ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

మరో వైపు తెలంగాణలో కూడా వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్ర, శనివారాల్లో గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భానుడి ప్రతాపంతో పాటు వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యంతో వేడి తీవ్రత మరింత పెరుగుతోంది.

ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్‌ నగరం కూడా వేడెక్కుతోంది. 18 జిల్లాలను వడగాలుల తీవ్రత జాబితాలో విపత్తుల శాఖ చేర్చింది. కుమురంభీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలకు మరింత ముప్పు ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ లో 40 డిగ్రీలు, బెల్లంపల్లి 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.