రాజధానిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు-తేలికపాటి వర్షం

రాజధానిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు-తేలికపాటి వర్షం

Delhi records 15 year low in temperature : దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గురవారం డిసెంబర్ 31నాడు, 1.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది గడిచిన 15 ఏళ్లలో అత్యల్ప ఉష్ణోగ్రతగా భారత వాతావరణ శాఖ తెలిపింది. 2006 జనవరి 8వ తేదీన ఢిల్లీలో 0.2 డిగ్రీల సెల్సియస్‌, 1935, జనవరిలో 0.6 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది ఇదే రోజున ఇక్కడ నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రత 2.4 డిగ్రీ సెల్సియస్‌ నమోదయ్యింది.

పొగ మంచు వల్ల రోడ్డుపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్ధితి ఏర్పడింది. పశ్చిమ ప్రాంతంలో ఏర్పడిన వాతావరణ పరిస్ధితుల కారణంగా జనవరి 2నుంచి 6వ తేదీ లోపు వాయువ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని సఫ్దర్ జంగా వాతావరణ పరిశీలనా కేంద్రం అధికారులు వివరించారు.  ఈనెల 3నుంచి 5వరకు తేలికపాటి వర్షంకుడా కురిసే అవకాశంఉందని వారు తెలిపారు.  కానీ శనివారం ఉదయం  ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. పాలం విమానాశ్రయంలో 0.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. రిడ్జ్, అయనగర్ , లోడి రోడ్ ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది.

మరో వైపు జమ్మూ కాశ్మీర్ లోనూ అతిశీతల పవనాలు  వీస్తున్నాయి. గుల్మార్గ్ లో గురువారం రాత్రి మైనస్ 9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వాతవరణం పొడిగా ఉన్నప్పటికీ అతి శీతల గాలుల వల్ల పైపుల్లో సరఫరా అవుతున్న నీరు సైతం గడ్డకట్టుకు  పోతోందని అధికారులు తెలిపారు. మంచు కురుస్తూ ఉండటంతో పరిసర ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకున్నట్లు  ఉండటంతో పర్యాటకులు ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.