జాగ్రత్త: కోస్తాకే కాదు సీమకూ పొగమంచు

  • Published By: veegamteam ,Published On : January 15, 2019 / 02:15 AM IST
జాగ్రత్త: కోస్తాకే కాదు సీమకూ పొగమంచు

తెలుగు రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. కోస్తాంధ్ర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పొగమంచు ఇప్పుడు రాయలసీమకూ విస్తరించింది. కోస్తాలోని అన్ని జిల్లాలతో పాటు రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది. సాయంత్రం నుంచి ఉదయం 9 గంటల వరకు పొగమంచు ఆవరించి ఉంటోంది. దీంతో ఉదయాన్నే పనులకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు కూడా పరేషాన్ అవుతున్నారు. 200 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలను గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. ఉదయం వేళల్లో సాధారణం కంటే తక్కువ స్పీడ్‌తో డ్రైవ్ చేయాల్సి వస్తోంది. మంచు దట్టంగా కురుస్తుండటంతో వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్లపై నెమ్మదిగా రాకపోకలు జరుగుతున్నాయి.

గతంలో ఇలాంటి పరిస్థితి లేదని ఈసారి మంచు ఎక్కువగా కురుస్తోందని వాహనాదారులు చెబుతున్నారు. పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. తూర్పు, ఈశాన్యం నుంచి రాష్ట్రం మీదుగా శీతల గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జంగమహేశ్వరపురం, ఆరోగ్యవరం, అనంతపురంలో రాత్రి 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తా, రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు సాదారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు ఎక్కువగా.. రాత్రి ఉష్ణోగ్రతలు 1 నుంచి 3 డిగ్రీల వరకు తక్కువగా రికార్డ్ అవుతున్నాయి. పొగమంచు కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు రాత్రి, ఉదయం సమయాల్లో పొగమంచు ఆవరిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో పొగమంచుకు తోడు శీతలగాలులు వీచే అవకాశముందన్నారు. తూర్పు ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలులతో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని అధికారులు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు సాధారణ స్ధాయికి దగ్గరగా నమోదవుతుండటంతో చలిప్రభావం నామమాత్రంగానే ఉండనుంది.