Telangana Rains : భారీ వర్షాలకు పొంగుతున్న వాగులు-నిండుతున్న జలాశయాలు

తెలంగాణలో విస్తరించిన రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని 20కి పైగా జిల్లాల్లో శుక్రవారం విస్తారంగా వర్షాలు కురిశాయి.

Telangana Rains : భారీ వర్షాలకు పొంగుతున్న వాగులు-నిండుతున్న జలాశయాలు

Telangana Heavy Rains

Telangana Rains  : తెలంగాణలో విస్తరించిన రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని 20కి పైగా జిల్లాల్లో శుక్రవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సుమారు 56 చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కుంటాల, పొచ్చెర జలపాతాల్లో నీటి ప్రవాహం పెరిగింది. మహబూబాబాద్‌ జిల్లా ఏటూరునాగారం సమీపంలోని జంపన్నవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. వెంకటాపూర్‌ మండలం రామప్ప చెరువు 23 అడుగులకు చేరి కళకళలాడుతున్నది.

కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ మానకొండూర్, హుజురాబాద్, శంకరపట్నం, సైదాపూర్ మండలాల్లో రాత్రి నుండి వర్షం కురుస్తూనే ఉంది. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు పెద్దపల్లి జిల్లాలోని పార్వతి బ్యారేజి 4 గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ పూర్తి స్ధాయి నీటిమట్టం 8.83 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.325 టీఎంసీల నీరు వచ్చి చేరింది.

పెద్దపల్లి జిల్లాలోని మంథని, కమాన్ పూర్, ముత్తారం, రామగిరి మండలాల్లో రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. భారీగా కురుస్తున్న వర్షాలు జిల్లాలోని సింగరేణి బొగ్గు గనులపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆర్టీ-3 ఏరియాలోని ఓసీపీ1, ఓసీపీ2 లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం…కాటారం సబ్ డివిజన్ లోని మహాముత్తారం, మల్హర్ ,పలిమెల, మహాదేవపూర్ మండలాలలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అటవీ ప్రాంతాలలో వాగులు పొంగిపొర్లుతున్నాయి.  మహముత్తారం మండలంలో పెద్దవాగు ఉదృతంగా ప్రవహిస్తోంది.  మేడారం-కాటరం కు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ రిజర్వాయరు 35 గేట్లు ఎత్తివేసి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా…. ప్రస్తుత నీటి నిలువ 5.98 టీఎంసీలుగా ఉంది.

Also Read : Heavy Rains In Telangana : తెలంగాణాలో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్-అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు నియోజక వర్గంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కురస్తోంది. ఇల్లందు, కోయగూడెం బొగ్గు గనులలో ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. కోయగూడెం ఓసి 2 గని లోకి భారీగా వరద నీరు చేరింది.  వరద నీటిని గని నుండి తొలగించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. భారీగా వరదనీరు చేరటంతో 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

కొత్తగూడెం జీకే ఉపరితల బొగ్గు గనిలో  ఉత్పత్తి పనులు  నిలిచిపోయాయి. సుమారు 6000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలంలోని తీగల బంజార వద్ద పగిడేరు ఏన్కూరు మండలంలోని జన్నారం అంజనాపురం మధ్య ఉన్న నిమ్మ వాగుకు వరద ఉధృతి తగ్గటంలో ఆ ప్రాంతంలో రాకపోకలు కొనసాగిస్తున్నారు.